Ravi Shastri to Kohli: సచిన్, ధోనీలను చూసి నేర్చుకో.. నీపై ఎప్పుడూ కెమెరా ఉంటుంది: కోహ్లికి రవిశాస్త్రి సూచన
09 May 2023, 19:22 IST
- Ravi Shastri to Virat Kohli: సచిన్, ధోనీలను చూసి నేర్చుకో.. నీపై ఎప్పుడూ కెమెరా ఉంటుంది అని కోహ్లికి రవిశాస్త్రి సూచించాడు. గంభీర్ తో గొడవపై క్రికిన్ఫోతో మాట్లాడుతూ శాస్త్రి ఈ కామెంట్స్ చేశాడు.
విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్
Ravi Shastri to Virat Kohli: సచిన్, ధోనీలను చాలా మంది క్రికెటర్లకు ఆదర్శప్రాయులుగా చూపిస్తుంటారు. వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఫీల్డ్ లో, బయట ఎంతో వినయంగా కనిపిస్తారు. విరాట్ కోహ్లి కూడా గొప్ప క్రికెటరే అయినా.. ఫీల్డ్ లో అతని దూకుడు అప్పుడప్పుడూ తలవంపులు తెచ్చిపెడుతోంది. దీంతో అతని మాజీ గురువు రవిశాస్త్రి.. కోహ్లికి కీలకమైన సూచన చేశాడు.
కోహ్లిలాంటి ప్లేయర్ పై ఎప్పుడూ ఓ కెమెరా ఉంటుందని, అందువల్ల కాస్త జాగ్రత్తగా మసలుకోవాలని సూచించాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తో కోహ్లి గొడవపై శాస్త్రి స్పందిస్తూ ఈ కామెంట్స్ చేశాడు. సచిన్, ధోనీలను ఉదాహరణగా చూపిస్తూ.. కెమెరా ముందు జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలో చెప్పాడు. క్రికిన్ఫోతో మాట్లాడిన సందర్భంగా ఈ అంశంపై శాస్త్రి స్పందించాడు.
"గత వారం జరిగిన పరిణామాలను చూసిన తర్వాత ఒక్కటే చెప్పదలచుకున్నాను. కోహ్లి అయినా, ధోనీ అయినా ఈ విషయం తెలుసుకోవాలి. నిజానికి ధోనీ ఓ ప్రొఫెషనల్. అతని తెలుసు. ఓ కెమెరా ఎప్పుడూ తనను ఫాలో అవుతుందని. ఎందుకంటే మీరు క్రికెట్ కు చేసిన గొప్ప సేవ కారణంగా ఇలా కెమెరాల కన్ను ఎప్పుడూ మీపై ఉంటుంది.
సచిన్ టెండూల్కర్ పై ఎప్పుడూ ఓ కెమెరా ఉన్నట్లే కోహ్లిపైనా ఉంటుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే వరకూ కెమెరా ఫాలో అవుతుందని గుర్తుంచుకోవాలి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అది గుర్తంచుకుంటే ఏ సమస్యా ఉండదు. ఆ కెమెరా వల్లే మీ గురించి చాలా మంది తెలుస్తుంది" అని రవిశాస్త్రి చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో జరిగిన పెద్ద గొడవ ఇదే. మొదట కోహ్లి, నవీనుల్ హక్ మధ్య మొదలైన గొడవ.. తర్వాత కోహ్లి, గంభీర్ కు పాకింది. వీళ్లిద్దరూ మాటామాటా అనుకుంటున్న వీడియో వైరల్ అయింది. కోహ్లి ఎంత గొప్ప ప్లేయర్ అయినా.. ఇలా ఫీల్డ్ లో అతని దూకుడు ప్రవర్తన కారణంగా ధోనీ, సచిన్ లకు ఉన్న ఫాలోయింగ్ ను అతడు సంపాదించుకోలేకపోతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.