Ponting on Sachin vs Kohli: సచిన్, కోహ్లిలలో ఎవరు గొప్ప.. పాంటింగ్ రియాక్షన్ ఇదీ
Ponting on Sachin vs Kohli: సచిన్, కోహ్లిలలో ఎవరు గొప్ప? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చాడు. సోమవారం (ఏప్రిల్ 24) సచిన్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ రికీ అతనికి బర్త్ డే విషెస్ చెప్పాడు.
మాస్టర్ చేసిన 100 సెంచరీల రికార్డును అందుకునే వైపు అడుగులు వేస్తున్న విరాట్ ను మాస్టర్ తో పోల్చడం సాధారణమైపోయింది. మరి ఒకప్పుడు సచిన్ తో పోటీ పడిన రికీ పాంటింగ్ దృష్టిలో ఎవరు గొప్ప? సచినా లేక విరాటా? దీనిపై తాజాగా పాంటింగ్ స్పందించాడు. ఐసీసీ రివ్యూలో స్పందించిన అతడు.. తన జనరేషన్ లో సచిన్ బెస్ట్ ప్లేయర్ అని అన్నాడు.
"సాంకేతికంగా ఎప్పటికీ సచినే బెస్ట్ బ్యాటర్ అని నేను చెబుతాను. అతన్ని కట్టడి చేయడానికి మేము ఎలాంటి ప్లాన్ తో వచ్చినా అతని దగ్గర దానికి సమాధానం ఉండేది. అది ఇండియాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా. ఎవరు బెస్ట్ అనేది అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఆటను తమదైన రీతిలో ఆడతారు. కానీ నేను క్రికెట్ ఆడే సమయంలో మాత్రం సాంకేతికంగా సచినే గొప్ప బ్యాటర్" అని పాంటింగ్ స్పష్టం చేశాడు.
ఇక సచిన్, కోహ్లిలపైనా అతడు స్పందించాడు. "ఎన్ని పరుగులు చేసినా, ఎన్ని సెంచరీలు కొట్టినా.. 200 టెస్టులు ఆడేంత శారీరక బలం, నైపుణ్య ఉండటం అద్భుతం. విరాట్ కూడా అలాంటి ప్లేయరే. అతడు అద్భుమైన ప్లేయర్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే 70కిపైగా అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కానీ సచిన్ 100 కొట్టాడన్న విషయం తెలుసు కదా? విరాట్ కెరీర్ కూడా ముగిసేంత వరకూ ఆగిన తర్వాత ఈ ఇద్దరినీ పోల్చితే బాగుంటుంది" అని పాంటింగ్ అన్నాడు.
సోమవారం (ఏప్రిల్ 24)తో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో ఎవరూ ఊహించని విధంగా 100 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు కూడా అతని పేరిటే ఉంది. 34 వేలకుపైగా రన్స్ చేయడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం విరాట్ అంతర్జాతీయ క్రికెట్ లో 25 వేలకుపైగా పరుగులు, 75 సెంచరీలు చేశాడు. కనీసం మరో మూడు, నాలుగేళ్లు ఆడే సత్తా ఉన్న కోహ్లి.. సచిన్ రికార్డులను బ్రేక్ చేయగలడేమో చూడాలి.
సంబంధిత కథనం