Kohli Breaks Lara Record: కోహ్లీ మరో అరుదైన ఘనత.. లారా రికార్డు బ్రేక్ చేసిన రన్ మెషిన్
Kohli Breaks Lara Record: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న లారాను అధిగమించాడు.
Kohli Breaks Lara Record: అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో విజృంభించగా.. విరాట్ కోహ్లీ అర్దశతకంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 14 నెలల విరామం తర్వాత మన రన్ మెషిన్ టెస్టుల్లో అర్ధ సెంచరీ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హాఫ్ సెంచరీతో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వేగంగా ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఫలితంగా సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు. ఇదే కాకుండా మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఫలితంగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను అధిగమించాడు. ఆసీస్‌పై కోహ్లీ 89 మ్యాచ్‌లు, 104 ఇన్నింగ్స్‌ల్లో 50.84 సగటుతో 4729 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 169గా ఉంది. మరోపక్క ఆస్ట్రేలియాపై లారా 82 మ్యాచ్‌లు, 108 ఇన్నింగ్స్‌ల్లో 4714 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధశతకాలు ఉన్నాయి. అతడి హయ్యెస్ట్ స్కోరు వచ్చేసి 277.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్‌గా సచిన్ తెందూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 110 మ్యాచ్‌లు, 144 ఇన్నింగ్స్‌ల్లో 49.68 సగటుతో 6707 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలు, 31 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు వచ్చేసి 241.
విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ సాధించి మూడేళ్లు దాటిపోయింది. చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌పై 136 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత టెస్టుల్లో ఇంతవరకు సెంచరీ సాధించలేదు. ఫార్మాట్‌ను పక్కనపెడితే దాదాపు మూడేళ్ల తర్వాత గతేడాది జరిగిన ఆసియా కప్‌లో ఆఫ్గనిస్థాన్‌పై సెంచరీ చేయడంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు కోహ్లీ.
ప్రస్తుతం నాలుగో టెస్టులో శుబ్‌మన్ గిల్ 235 బంతుల్లో 128 పరుగులతో ఆకట్టుకోగా.. కోహ్లీ 59 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల లక్ష్యాన్ని అధిగమించేందుకు మరో 191 పరుగుల దూరంలో టీమిండియా ఉంది.
సంబంధిత కథనం