Ravi Shastri on Rohit Sharma: అంతా బాగున్నప్పుడు గెలిపించాడు కానీ.. రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
08 May 2023, 16:41 IST
- Ravi Shastri on Rohit Sharma: అంతా బాగున్నప్పుడు ఎవరైనా గెలిపిస్తారు కానీ అంటూ రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. ఓ కెప్టెన్ గా అతనికి సవాళ్లు రెట్టింపయ్యాయని అతడు అన్నాడు.
రోహిత్ శర్మ, రవిశాస్త్రి
Ravi Shastri on Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. రెండు, మూడేళ్ల కిందట ముంబై టీమ్ బాగున్నప్పుడు అతని పని సులువైందని, అయితే ఇప్పుడు మాత్రం అతనికి సవాళ్లు రెట్టింపయ్యాయని అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో గత సీజన్ లో ముంబై చివరి స్థానానికి పరిమితమైంది.
ఈ ఏడాది కూడా 10 మ్యాచ్ లలో ఐదు గెలిచి, మరో ఐదు ఓడి ఆరోస్థానంలో ఉంది. ఇక రోహిత్ బ్యాటింగ్ కూడా దారుణంగా ఉంది. పది మ్యాచ్ లలో అతడు కేవలం 184 రన్స్ మాత్రమే చేశాడు. చెన్నైతో మ్యాచ్ లోనూ అతడు మరోసారి డకౌటయ్యాడు. దీంతో రవిశాస్త్రి అతని కెప్టెన్సీ గురించి క్రికిన్ఫోతో మాట్లాడుతూ స్పందించాడు.
"తన వ్యక్తిగత ఆటతీరు కెప్టెన్సీపై ప్రభావం చూపుతుంది. బాగా పరుగులు చేస్తున్నప్పుడు కెప్టెన్సీ కూడా సులువు అవుతుంది. ఫీల్డ్ లో బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఫుల్ ఎనర్జీతో కనిపిస్తారు. కానీ పరుగులు చేయలేకపోయినప్పుడు ఎంతటి ప్లేయర్ అయినా ఏమీ చేయలేడు" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఇక గత రెండు, మూడేళ్ల కింద జట్టులో ఉన్న వనరులు ఇప్పుడు లేకపోవడం కూడా రోహిత్ కెప్టెన్సీని సవాలు చేస్తోందని శాస్త్రి అన్నాడు.
"రెండు, మూడేళ్ల కిందట జట్టులో ఉన్న వనరులు ఇప్పుడు లేవు. ఇదే అసలైన సవాలు. అలాంటి టీమ్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? వాళ్లను ఎలా మోటివేట్ చేయాలి? ఓ కాంబినేషన్ ఎలా క్రియేట్ చేయాలి? అనే సమస్య ఉంటుంది.
అందువల్ల కెప్టెన్ గా రోహిత్ సవాళ్లు రెట్టింపయ్యాయి. రెండేళ్ల కిందటితో పోలిస్తే కెప్టెన్ పని కూడా రెట్టింపైంది అప్పుడంతా బాగుండేది. దీంతో పని చాలా సులువయ్యేది. కానీ ఇప్పుడెలా ఉన్నా కెప్టెన్సీ అయితే చేయాలి.
గతంలో అద్బుతంగా చేశాడు. ఇప్పుడు కష్టం. అతనికి ఉన్న టీమ్ మునుపటిలా లేదు. అప్పటి టీమ్ బాగుండేది. వచ్చే రెండేళ్లలో ఈ టీమ్ సక్సెస్ కావచ్చు. కానీ ఆ దిశగా సరైన టీమ్ ను రోహిత్ తయారు చేయాలి"అని రవిశాస్త్రి అన్నాడు.