CSK vs MI: రెండో స్థానానికి దూసుకెళ్లిన చెన్నై.. ముంబయిపై అద్భుత విజయం-chennai super kings rise to 2nd spot after win aganist mumbai indians ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Vs Mi: రెండో స్థానానికి దూసుకెళ్లిన చెన్నై.. ముంబయిపై అద్భుత విజయం

CSK vs MI: రెండో స్థానానికి దూసుకెళ్లిన చెన్నై.. ముంబయిపై అద్భుత విజయం

CSK vs MI: చెపాక్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది ధోనీ సేన. అంతేకాకుండా గత ఐదు సందర్భాల్లో ముంబయిని నాలుగు సార్లు ఓడించింది.

ముంబయిపై చెన్నై అద్భుత విజయం (AP)

CSK vs MI: ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 140 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో డేవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(30) నిలకడగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో శివమ్ దూబే(26*) 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించి విజయతీరాలకు చేర్చాడు. ముంబయి బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు తీయగా.. ట్రిస్టన్ స్టబ్స్, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. 11 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఆరింటిలో విజయం సాధించగా.. 4 గేముల్లో ఓడింది. ఒకదాంట్లో మాత్రం ఫలితం తేలలేదు. ఫలితంగా 13 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. 7 విజయాలతో 14 పాయింట్లు సాధించిన గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ముంబయి-చెన్నై ముఖాముఖి 36 సార్లు తలపడగా.. ధోనీ సేన 16 సార్లు గెలవగా.. రోహిత్ జట్టు 20 సార్లు విజయం సాధించి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే గత ఐదు సందర్భాల్లో చెన్నై 4 సార్లు గెలవగా.. ముంబయి ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఓ సీజన్‌లో ముంబయిపై చెన్నై రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ఇది రెండో సారి. అంతకుముందు 2014 సీజన్‌లోనూ ఈ విధమైన ఘనత సాధించింది సీఎస్‌కే.

నేటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. చెన్నై ముందు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి140 పరుగుల లక్ష్యాన్ని నెలకొల్పింది. . నేహల్ వధేరా(64) అర్ధశతకం మినహా మిగిలిన వారంత తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. సూర్యకుమార్ యాదవ్(26) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ జడేజా అతడిని క్లీన్ బౌల్డ్ చేసి ముంబయిని ఘోరంగా దెబ్బకొట్టాడు. రోహిత్ శర్మ డకౌటై మరోసారి విఫలమయ్యాడు. ఆరంభంలోనే చెన్నై బౌలర్ దీపక్ చాహర్ ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ వికెట్లను పడగొట్టాడు. ముంబయి బౌలర్లలో మతీష ప్రతిరాణ 3 వికెట్లతో విజృంభించగా.. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది.