Most Ducks in IPL: రోహిత్ పేరిట చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబయి కెప్టెన్‌ అరుదైన ఘనత-rohit sharma bags worst record becomes most duck outs in ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Most Ducks In Ipl: రోహిత్ పేరిట చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబయి కెప్టెన్‌ అరుదైన ఘనత

Most Ducks in IPL: రోహిత్ పేరిట చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబయి కెప్టెన్‌ అరుదైన ఘనత

Most Ducks in IPL: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. అంతేకాకుండా ఎక్కువసార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డు (AP)

Most Ducks in IPL: ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో పదే పదే తడబడుతున్న హిట్ మ్యాన్ అభిమానులకు నిరాశ కలగజేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ మరోసారి నిరుత్సాహపరిచాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ డకౌట్‌గా నిలిచాడు. ఫలితంగా తన పేరిట ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగులేమి చేయకుండా ఔటైన హిట్ మ్యాన్.. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 16 సార్లు డకౌట్ అయ్యాడు.

రోహిత్ అత్యధికంగా 16 సార్లు సున్నా పరుగులకే ఔట్ కాగా.. అతడి తర్వాత స్థానాల్లో వరుసగా సునీల్ నరైన్(15), మన్‌దీప్ సింగ్(15), దినేశ్ కార్తిక్(15) ఉన్నారు. హిట్ మ్యాన్ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పాటు రోహిత్ మరో చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్‌గా రోహిత్ అపవాదు మూటగట్టుకున్నాడు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా 11 సార్లు అతడు సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు గౌతమ్ గంభీర్‌(10)తో సమానంగా ఉన్న హిట్ మ్యాన్.. తాజాగా ఆ రికార్డును అధిగమించాడు.

చెన్నైతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది. నేహల్ వధేరా(64) అర్ధశతకం మినహా మిగిలిన వారంత తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. సూర్యకుమార్ యాదవ్(26) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ జడేజా అతడిని క్లీన్ బౌల్డ్ చేసి ముంబయిని ఘోరంగా దెబ్బకొట్టాడు. రోహిత్ శర్మ డకౌటై మరోసారి విఫలమయ్యాడు. ఆరంభంలోనే చెన్నై బౌలర్ దీపక్ చాహర్ ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ వికెట్లను పడగొట్టాడు. ముంబయి బౌలర్లలో మతీష ప్రతిరాణ 3 వికెట్లతో విజృంభించగా.. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.