Gavaskar on Rohit Sharma: రోహిత్ కాస్త బ్రేక్ తీసుకో.. హిట్ మ్యాన్‌కు గవాస్కర్ సలహా
07 May 2023, 14:54 IST
- Gavaskar on Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు కాస్త ఆటకు బ్రేక్ తీసుకోమని సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. వరుసగా విఫలమవుతున్న అతడికి వరల్డ్ టెస్ట్ ఛాంఫియన్‌షిప్‌లో ఫోకస్ కోసం బ్రేక్ అవసరమని తెలిపారు.
రోహిత్ శర్మ
Gavaskar on Rohit Sharma: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా డకౌట్లు అవుతూ ఈ విషయంలో తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా, కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీలు సైతం హిట్ మ్యాన్ బ్రేక్ తీసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇదే విషయాన్ని తెలియజేశారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పైనల్ దృష్టిలో ఉంచుకొని రోహిత్ ఆటకు కాస్త బ్రేక్ తీసుకోవాలని సలహా ఇచ్చారు.
"నేను రోహిత్‌ను ఆట నుంచి బ్రేక్ తీసుకోమని సలహా ఇస్తున్నాను. కాస్త సమయం గడిస్తే అతడికి రిలాక్స్‌గా ఉంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతడు ఫిట్‌గా ఉండాలంటే బ్రేక్ అవసరం. గత కొన్ని మ్యాచ్‌లుగా రోహిత్ పుంజుకున్నప్పటికీ ప్రస్తుతం అతడికి చిన్న బ్రేక్ కావాలి. తనకు తానుగా విశ్రాంతి తీసుకోవాలి." అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లండన్ ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబయి ఈ సీజన్‌లో ప్రారంభంలో తడబడినప్పటికీ అనంతరం పుంజుకుని వరుసగా విజయాలు సాధిస్తోంది. అయితే వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం రోహిత్ విఫలమవుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు.
శనివారం నాడు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓటమి పాలైంది. 140 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది సీఎస్‌కే. చెన్నై బ్యాటర్లలో డేవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(30) నిలకడగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో శివమ్ దూబే(26*) 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించి విజయతీరాలకు చేర్చాడు. ముంబయి బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు తీయగా.. ట్రిస్టన్ స్టబ్స్, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.