Virat Kohli: కోహ్లి గొప్ప మనసు.. బాల్‌బాయ్‌తో ఎలా వ్యవహరించాడో చూడండి
09 May 2023, 18:48 IST
- Virat Kohli: కోహ్లి గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ బాల్‌బాయ్ అడిగిన వెంటనే తన ఆటోగ్రాఫ్ ఉన్న ఓ బ్యాట్ ను అతనికి ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
బాల్‌బాయ్ కి బ్యాట్ ఇవ్వమని చెబుతున్న విరాట్ కోహ్లి
Virat Kohli: విరాట్ కోహ్లి ఫీల్డ్ లో ఎంత దూకుడుగా ఉన్నా.. బయట మాత్రం అభిమానులతో హుందాగా వ్యవహరిస్తాడు. వాళ్ల కోరికను కాదనకుండా సెల్ఫీలకు పోజులిస్తాడు. ఆటోగ్రాఫ్ లూ ఇస్తాడు. తాజాగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆడటానికి వెళ్లిన సందర్భంగా ఓ బాల్‌బాయ్ అడగ్గానే తాను సంతకం చేసిన ఓ బ్యాట్ ను అతనికి ఇచ్చేశాడు విరాట్ కోహ్లి.
దీంతో ఆ బాల్‌బాయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కోసం ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వాంఖెడేలో ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే సమయంలో ఓ బాల్‌బాయ్ అతన్ని పిలిచాడు. మీరు సంతకం చేసిన ఓ బ్యాట్ కావాలని అడిగాడు. దీంతో వెంటనే తన వెనుక వస్తున్న స్టాఫ్ కు అతనికి ఓ బ్యాట్ ఇవ్వాల్సిందిగా చెప్పాడు.
కోహ్లి ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ను ఆ బాల్‌బాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ ఆనందపడిపోయాడు. ఫీల్డ్ లో కోహ్లి దూకుడుగా ఉండటం చూసి చాలా మంది అతన్ని పొగరుబోతుగా చెబుతుంటారు. కానీ అది మ్యాచ్ ఆడుతున్నంత వరకే. ఒక్కసారి ఫీల్డ్ నుంచి బయటకు వస్తే ప్రత్యర్థి ప్లేయర్స్ అయినా, అభిమానులతో అయినా విరాట్ చాలా వినయంగా ఉంటాడు.
గతంలోనూ ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. తాజాగా ఈ ఘటన మరోసారి దానినే ప్రూవ్ చేసింది. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో విరాట్ నిలకడగా రాణిస్తున్నా అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. కోహ్లి 10 మ్యాచ్ లలో 419 పరుగులు చేశాడు. అందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 135గా ఉంది. ప్రస్తుతం ముంబై, ఆర్సీబీ రెండూ ఐదేసి విజయాలతో 10 పాయింట్లు సాధించాయి.
ప్లేఆఫ్స్ రేసు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విజయం సాధించడం రెండు జట్లకూ అత్యవసరం. మరి ఇలాంటి మ్యాచ్ లో కోహ్లి స్ట్రైక్ రేట్ మెరుగవుతుందా? ముంబై కెప్టెన్ రోహిత్ మళ్లీ గాడిలో పడతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.