Hayden on Dhoni: ధోనీ ఓ మాంత్రికుడు.. చెత్తను కూడా నిధిగా మారుస్తాడు: హేడెన్
26 May 2023, 15:42 IST
- Hayden on Dhoni: ధోనీ ఓ మాంత్రికుడు.. చెత్తను కూడా నిధిగా మారుస్తాడు అని అన్నాడు మాథ్యూ హేడెన్. ఈ ఏడాది సీఎస్కే జైత్రయాత్రపై హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఎమ్మెస్ ధోనీ
Hayden on Dhoni: మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు ఆస్ట్రేలియా, సీఎస్కే మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్. ఎవరిదో చెత్తను తీసుకొని కూడా అతడు ఓ నిధిగా మార్చగలడని హేడెన్ అనడం విశేషం. గతేడాది ఐపీఎల్లో 9వ స్థానంలో నిలిచిన సీఎస్కే.. ఈసారి అద్భుతంగా పుంజుకొని పదోసారి ఫైనల్ చేరడంలో కెప్టెన్ గా ధోనీ వ్యూహాలు ముఖ్యమైన పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.
ఈ ఏడాది అజింక్య రహానే, శివమ్ దూబెలాంటి ప్లేయర్స్ రాణించిన తీరు కూడా ధోనీ సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు. పీటీఐతో మాట్లాడిన హేడెన్.. ధోనీ కెప్టెన్సీని ఆకాశానికెత్తాడు. "ఎమ్మెస్ ఓ మాంత్రికుడు. ఎవరిదో చెత్త తీసుకొని కూడా నిధిగా మారుస్తాడు. అతడు చాలా నైపుణ్యవంతమైన, సానుకూల కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య చక్కని సమన్వయం కుదిర్చాడు. నా వరకూ ధోనీ అంటే అదీ.
పరిస్థితులను గమనించడం, వాటికి తగినట్లు పని చేయడం అతనికి అలవాటు. ఇండియన్ క్రికెట్ తో అదే చేశాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తోనూ చేస్తున్నాడు. వచ్చే ఏడాది అతడు ఆడతాడా లేదా అన్నదానితో సంబంధం లేదు. నా వరకూ అతడు ఆడతాడని అనుకోవడం లేదు. కానీ చెప్పలేం. ధోనీ అంటే అదే మరి" అని హేడెన్ అన్నాడు.
ఇక టీ20 క్రికెట్ పెరిగిపోతున్న నేపథ్యంలో మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్స్ సంఖ్య తగ్గిపోతోందని కూడా ఈ సందర్భంగా హేడెన్ చెప్పాడు. "మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్స్ దాదాపు కనుమరుగయ్యే దశలో ఉన్నారు. కొన్ని ఫార్మాట్లు అవసరమా అని కూడా అనిపిస్తోంది. టెస్ట్ క్రికెట్ కు మంచి ఆదరణ ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ దానికి నిదర్శనం. లేదంటే టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడతారని అనుకుంటున్నా" అని హేడెన్ చెప్పాడు. రానున్న తరం క్రికెటర్లు ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడటానికే ఎక్కువ మొగ్గు చూపుతారని కూడా హేడెన్ స్పష్టం చేశాడు.