Hayden on Gill: వచ్చే పదేళ్ల పాటు గిల్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు: హేడెన్
Hayden on Gill: వచ్చే పదేళ్ల పాటు గిల్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడు ఆడిన కొన్ని షాట్లు చూసి హేడెన్ ఈ కామెంట్స్ చేశాడు.
Hayden on Gill: ఏడాది కాలంగా టీమిండియాలో కీలక ప్లేయర్ గా మారిపోయాడు శుభ్‌మన్ గిల్. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్ అవుతున్నాడు. ఓపెనర్ గా సత్తా చాటుతూ గొప్ప ప్లేయర్స్ నుంచి కితాబు అందుకుంటున్నాడు. తాజాగా ఐపీఎల్లోనూ గుజరాత్ టైటన్స్ విజయాల్లో అతడే కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని బ్యాటింగ్ చూసిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్.. గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన అతడు.. ప్రపంచ క్రికెట్ ను గిల్ శాసిస్తాడని అనడం విశేషం. "మంచి బౌలింగ్ అటాక్ ఉన్న పంజాబ్ కింగ్స్ పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం కోసం గుజరాత్ టైటన్స్ కు బాధ్యత తీసుకునే ఓ ప్లేయర్ అవసరమయ్యాడు. శుభ్‌మన్ గిల్ చేసింది అదే. అతడు ఆడిన కొన్ని షాట్లు చూడ ముచ్చటగా ఉన్నాయి. అతడో క్లాస్ ప్లేయర్. వచ్చే పదేళ్ల పాటు అతడు ప్రపంచ క్రికెట్ ను ఏలుతాడు" అని హేడెన్ అనడం విశేషం.
ఈ మ్యాచ్ లో గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. గిల్ ను అందరూ ప్రశంసిస్తున్నా.. ఈ మ్యాచ్ లో అతని స్ట్రైక్ రేట్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. తన వ్యక్తిగత రికార్డుల కోసమే గిల్ ఆడుతున్నట్లు కనిపించిందని, ఇలా చేస్తే క్రికెట్ ఏదో ఒక రోజు అతన్ని గట్టి దెబ్బ కొడుతుందని వీరూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
చివరి ఓవర్లో గిల్ ఔటవడంతో గుజరాత్ టైటన్స్ పై ఒత్తిడి పెరిగింది. అయితే ఆ సమయంలో రాహుల్ తెవాతియా ఎప్పటిలాగే కూల్ గా ఉంటూ మ్యాచ్ ను మరో బంతి మిగిలి ఉండగానే ముగించేశాడు. ఆ సమయంలో తెవాతియా ఆడిన స్కూప్ షాట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సంబంధిత కథనం