Harbhajan to Kohli: శ్రీశాంత్‌ను కొట్టినందుకు ఇప్పటికీ సిగ్గుపడుతున్నా.. కోహ్లీ నువ్వలా చేయకు: హర్భజన్
02 May 2023, 14:42 IST
- Harbhajan to Kohli: శ్రీశాంత్‌ను కొట్టినందుకు ఇప్పటికీ సిగ్గుపడుతున్నా.. కోహ్లీ నువ్వో లెజెండ్.. అలా చేయకు అని హర్భజన్ సింగ్ అనడం గమనార్హం. కోహ్లి, గంభీర్, నవీన్ గొడవపై మ్యాచ్ తర్వాత భజ్జీ ఇలా స్పందించాడు.
హర్భజన్ సింగ్, గంభీర్, విరాట్, శ్రీశాంత్
Harbhajan to Kohli: ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని ఘటన తొలి సీజన్ లోనే జరిగింది. అప్పటి టీమిండియా పేసర్ శ్రీశాంత్ ను హర్భజన్ సింగ్ గ్రౌండ్ లోనే చెంపదెబ్బ కొట్టడం, అతడు ఏడవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత హర్భజన్ పై బీసీసీఐ నిషేధం విధించింది. తాజాగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, నవీనుల్ హక్ గొడవ నేపథ్యంలో అప్పటి గొడవను హర్భజన్ గుర్తు చేసుకున్నాడు.
తాను అలా చేసినందుకు ఇప్పటికీ సిగ్గు పడుతున్నానని, కోహ్లి ఓ లెజెండ్ అని, అతడు ఇలాంటివి చేయకూడదని భజ్జీ అనడం విశేషం. నిజానికి 2013 నుంచి కోహ్లి, గంభీర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అప్పట్లో గంభీర్ కోల్‌కతా కెప్టెన్ గా ఉన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో విరాట్ ఔటైన తర్వాత గంభీర్ ఏదో అనడం.. దానికి కోహ్లి చాలా తీవ్రంగా స్పందించడంతో గొడవ ముదిరింది.
అప్పటి నుంచీ ఇద్దరి మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్సీబీ, లక్నో మ్యాచ్ తర్వాత మరోసారి ఈ ఇద్దరూ ఫేస్ టు ఫేస్ తిట్టుకున్నారు. ఈ గొడవపై మాజీ స్పిన్నర్ హర్భజన్ స్పందించాడు. ఇది ఇక్కడితో ఆగదని, దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుందని అతడు అన్నాడు.
"ఇది ఇక్కడితో ఆగదు. దీని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఏం చేశారన్నది మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇది నేను స్వయంగా అనుభవించాను. 2008లో శ్రీశాంత్, నా మధ్య జరిగిన గొడవలాగే ఇది కూడా ఉంది. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత దాని గురించి ఆలోచిస్తే సిగ్గేస్తుంది. అప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించినప్పుడు నేను చేసింది కరెక్టే అనిపించింది. కానీ అది తప్పు. నేను తప్పు చేశాను" అని భజ్జీ అనడం గమనార్హం.
ఇక విరాట్ కోహ్లికి కూడా ఈ సందర్భంగా భజ్జీ ఓ సలహా ఇచ్చాడు. "విరాట్ కోహ్లి, నువ్వో లెజెండ్. ఇలాంటి వాటిలో నువ్వు ఇన్వాల్వ్ కావడం సరి కాదు. కానీ అతనిలాంటి ప్లేయర్ ఆటలో పూర్తిగా లీనమైన సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి.
ఇందులో ఎవరి తప్పు ఉందన్నదానిపై చర్చ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇది క్రికెట్ కు మంచిది కాదు. మీరిద్దరూ నా తమ్ముళ్లలాంటి వాళ్లు. ఆ చనువుతో చెబుతున్నాను.. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నంలో నా గొడవ గురించి పదే పదే చెబుతున్నాను.
ఇప్పటికీ దాని గురించి నేను బాధ పడుతూనే ఉన్నాను. మీరు కూడా 15 ఏళ్ల తర్వాత ఇలాగే ఫీలవుతారు. ఇదో చిన్న విషయం. అక్కడే పరిష్కరించుకునే అవకాశం ఉండేది. వీటిని మరచిపోండి. ఇక్కడితో ముగించండి. ఇద్దరి కలుసుకోండి. ఆత్మీయంగా పలకరించుకోండి. పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు. వారికి సరైన సందేశం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది" అని హర్భజన్ అన్నాడు.