Sehwag on Slapgate Incident: శ్రీశాంత్-హర్భజన్‌కు సెహ్వాగ్ కౌంటర్.. చెంపపై దాడిని గుర్తు చేస్తూ కామెంట్
Sehwag on Slapgate Incident: శ్రీశాంత్-హర్భజన్ సింగ్‌కు సెహ్వాగ్ ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. శ్రీశాంత్‌ను భజ్జీ చెంపపై కొట్టడాన్ని గుర్తు చేస్తూ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఇందుకు హర్భజన్ కాస్త అసౌకర్యంగా ఫీలయ్యాడు.
Sehwag on Slapgate Incident: వెటకారాన్ని కూడా ఛమత్కారంగా మార్చి కౌంటర్ ఇవ్వడంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. సోషల్ మీడియా వేదికగా అతడు చేసే ట్వీట్లు ఫన్నీగా ఉండటమే కాకుండా.. ఎవరికి, ఎక్కడ తగలాలో వారికి కచ్చితంగా తగులుతుంది. అందుకే సెహ్వాగ్ కామెంట్లకు, ట్వీట్ల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సెహ్వాగ్ మరోసారి తనదైన శైలిలో కామెంట్ చేశాడు. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపపై కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్ సీజన్‌లో వివాదాల గురించి ఇటీవలే భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్, సెహ్వాగ్ ఓ చిట్ చాట్ నిర్వహించగా భజ్జీపై సెహ్వాగ్ ఫన్నీ కామెంట్ చేశాడు.
అసలు విషయానికొస్తే.. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)- ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఆడగా.. హర్భజన్ ముంబయికి ప్రాతినిధ్యం వహించాడు. అయితే శ్రీశాంత్-భజ్జీ మధ్య మాటల వాదన కాస్త భౌతిక దాడి వరకు చేరింది. శ్రీశాంత్‌ను హర్భజన్.. చెంపపై కొట్టాడు. అనంతరం ఈ పేసర్ మైదానంలో ఏడుస్తూ కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో ఈ వివాదం ఎప్పటికీ గుర్తుండిపోయింది.
ఈ ఘటన తర్వాత శ్రీశాంత్-భజ్జీ కొన్ని రోజులు మాట్లాడుకోనప్పటికీ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులుగా మెలగడమే కాకుండా.. కలిసినప్పుడల్లా చేతులు కలుపుతూ.. హగ్ చేసుకుంటూ కనిపించారు. ఇటీవల 2011 ప్రపంచకప్ గెలిచి 11 ఏళ్లయిన సందర్భంగా వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇరువురు ఒకరినొకరు కౌగిలించుకుంటూ తమ స్నేహాన్ని చాటారు. తాజాగా సెహ్వాగ్‌తో కలిసి భజ్జీ, శ్రీశాంత్, యూసుఫ్ పఠాన్ ఓ చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హర్భజన్‌తో స్నేహం గురించి శ్రీశాంత్ కొన్ని విషయాలను పంచుకున్నాడు.
"నేను మ్యాచ్ లేదా టెస్టు ఆడే ముందు ఎల్లప్పుడు భజ్జీని హగ్ చేసుకుంటాను. అప్పుడు నా ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉంటుంది." అని శ్రీశాంత్ అనగా ఇందుకు సెహ్వాగ్ ఫన్నీగా బదులిచ్చాడు. "ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి మొదలైంది! బహుశా మొహాలీలో జరిగిన ఆ ఘటన(శ్రీశాంత్ చెంపపై భజ్జీ కొట్టడం) తర్వాత అయి ఉంటుంది." అని తనదైన కౌంటర్ ఇచ్చాడు సెహ్వాగ్. వెంటనే పక్కనే ఉన్న హర్భజన్ అందుకుంటూ "ఆ విషయాన్ని మర్చిపోండి బాబు" అంటూ అసౌకర్యంగా ఫీలయ్యాడు.
సెహ్వాగ్ అడిగిన ప్రశ్నకు అనంతరం శ్రీశాంత్ సమాధానమిస్తూ.. "లేదు 2006లో మొదలైంది. భజ్జీకి షేక్ హ్యాండ్ ఇచ్చాను." అంతటితో ఆగకుండా "మనుషులు ఎప్పుడో ఏదోకటి మాట్లాడుతూనే ఉంటారు" అంటూ ఆ మ్యాటర్‌ను అక్కడితో కట్ చేశాడు.