తెలుగు న్యూస్  /  Sports  /  Gavaskar On Jadeja No Balls Says You Should Not Do The Same Mistake Again And Again

Gavaskar on Jadeja no balls: ఒకే తప్పు ఎన్నిసార్లు చేస్తావ్.. జడేజా నోబాల్స్‌పై మండిపడిన గవాస్కర్

Hari Prasad S HT Telugu

02 March 2023, 11:03 IST

    • Gavaskar on Jadeja no balls: ఒకే తప్పు ఎన్నిసార్లు చేస్తావ్ అంటూ జడేజా పదేపదే నోబాల్స్‌ వేయడంపై మండిపడ్డాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అతడు వేసిన ఓ నోబాల్ పెద్ద నష్టమే చేసింది.
ఈ సిరీస్ లో ఇప్పటికే ఎనిమిది నోబాల్స్ వేసిన జడేజా
ఈ సిరీస్ లో ఇప్పటికే ఎనిమిది నోబాల్స్ వేసిన జడేజా (AFP)

ఈ సిరీస్ లో ఇప్పటికే ఎనిమిది నోబాల్స్ వేసిన జడేజా

Gavaskar on Jadeja no balls: స్పిన్నర్లు వేసేదే నాలుగు అడుగులు. అందులోనూ జడేజా బౌలింగ్ అయితే మరీ సింపుల్ గా ఉంటుంది. కానీ అలాంటి జడేజా పదే పదే నోబాల్స్ వేస్తూ విసిగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు జడ్డూ వేసిన ఓ నోబాల్ వల్ల లబుషేన్ బతికిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా నిలదొక్కుకొని కీలకమైన ఆధిక్యం సంపాదించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

లబుషేన్ ను తక్కువ స్కోరుకే పెవిలియన్ కు పంపే అవకాశం వచ్చినా.. జడేజా నోబాల్ టీమ్ కొంప ముంచింది. ఆ తర్వాత అతన్ని జడేజానే ఔట్ చేసినా.. అప్పటికే ఆలస్యమైంది. జడేజా కారణంగా తొలి ఐదు ఓవర్లలోనే ఇండియా రెండు రివ్యూలు కూడా నష్టపోయింది. అయితే జడేజా వేసిన ఆ నోబాల్ పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. ఒకే తప్పు ఎన్నిసార్లు చేస్తావంటూ జడేజాపై మండిపడ్డాడు.

"నోబాల్ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నా. ఓ ప్రొఫెషనల్ గా ఒకే తప్పు పదే పదే చేయకూడదు. ముఖ్యంగా ఓ స్పిన్నర్ కచ్చితంగా లైన్ దాటకూడదు. రోజు ముగిసిన తర్వాత ఇంటర్వ్యూకు వచ్చిన సమయంలో నీ నియంత్రణలో ఉన్న పనులు మాత్రమే చేయగలను అని చెబుతావు. నోబాల్స్ వేయకపోవడం కచ్చితంగా నీ కంట్రోల్లోనే ఉంటుంది. మరి ఎందుకిలా జరుగుతోంది? దీనికి ఎవరు బాధ్యులు. కేవలం బౌలరేనా, బౌలింగ్ కోచ్ కూడానా? ఎవరైనా సరే.. ఈ మూడు టెస్టుల్లో ఇది చాలాసార్లు జరిగింది" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.

ఈ సిరీస్ లో జడేజా ఇప్పటి వరకూ 8 నోబాల్స్ వేయడం గమనార్హం. మూడో టెస్టులో లబుషేన్ ను సున్నా పరుగుల దగ్గరే బౌల్డ్ చేసినా అది కాస్తా నోబాల్ గా తేలింది. గవాస్కరే కాదు.. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా జడేజా తీరుపై మండిపడ్డాడు.

"బహుశా కెరీర్ లోనే 8 నోబాల్స్ వేయకూడదు. రవీంద్ర జడేజాలాంటి బౌలర్ నుంచి ఇది ఊహించలేదు. వికెట్ పడినప్పుడు అది నోబాల్ గా తేలడం మరింత ఆందోళన కలిగించేది. లబుషేన్ డకౌట్ అయి ఉంటే ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ లో ఓ భయం నెలకొనేది. 10 పరుగులకే 2 వికెట్లు పడిపోతే.. 25 పరుగులకే 4 పడిపోయేవేమో" అని భజ్జీ అన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కోల్పోయిన తొలి నాలుగు వికెట్లు జడేజా ఖాతాలోకే వెళ్లినా.. అతడు వేసిన ఆ నోబాల్ ఇండియాను దెబ్బ తీసింది.