Marnus Labuschagne on Ashwin: అశ్విన్‌తో ఆట మంచి చెస్ ఆడినట్లే ఉంటుంది: లబుషేన్
Marnus Labuschagne on Ashwin: అశ్విన్‌తో ఆట మంచి చెస్ ఆడినట్లే ఉంటుందని అన్నాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్. వచ్చే నెలలో ఇండియాలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఆడటానికి ఆస్ట్రేలియా వస్తున్న విషయం తెలిసిందే.
Marnus Labuschagne on Ashwin: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఇండియాలో టెస్ట్ సిరీస్ జరిగితే అది మన స్పిన్ బౌలర్లు, వాళ్ల బ్యాటర్ల మధ్య సమరంలాగే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని జయించి వచ్చినా.. ఆస్ట్రేలియా టీమ్ మన దగ్గర స్పిన్ బౌలింగ్‌కు బోల్తా పడి తలవంచిన సందర్భాలు మనం చూశాం. ఇక ఇప్పుడు కూడా మరోసారి ఇండియా స్పిన్నర్లు, ఆస్ట్రేలియా బ్యాటర్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.
ఈ నేపథ్యంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్.. ఇండియా టూర్, స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు త్వరలోనే ఆస్ట్రేలియా టీమ్ రానుంది. ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. గత ఆస్ట్రేలియా టూర్‌లో లబుషేన్.. అశ్విన్ బౌలింగ్‌లో రెండుసార్లు ఔటైనా కూడా ఆ సిరీస్‌లో 426 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
దీంతో ఈసారి ఇండియా టూర్‌లోనూ అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి. "నేను అశ్విన్ గురించి విన్న తర్వాత, అతని బౌలింగ్ ఎదుర్కొన్న తర్వాత నా ఆటను కాస్త మార్చుకున్నాను. అతని కొన్ని ఆలోచనలను దెబ్బకొట్టే విధంగా నా ఆటతీరు మార్చుకున్నాను. ఇప్పుడు కూడా అతనితో ఆట ఓ మంచి చెస్ గేమ్‌లా ఉంటుంది. దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని లబుషేన్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌తో చెప్పాడు.
అంతేకాదు 2020-21లో ఆస్ట్రేలియాలో ఇండియా సిరీస్ ముగిసినప్పటి నుంచే తాను ఇండియాలో సిరీస్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు కూడా లబుషేన్ వెల్లడించాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో అతడు ఆడుతున్నారు. అది ముగిసిన తర్వాత ఇండియా టూర్‌కు ప్లాన్ చేయడం మొదలుపెడతానని చాలా మంది భావిస్తున్నారని, కానీ తాను మాత్రం ఎప్పటి నుంచో అదే పనిలో ఉన్నట్లు వెల్లడించాడు.
"నా ప్లాన్స్ గురించి ఇప్పటికే ఆలోచించి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని అమలు చేయడమే మిగిలింది. అది పని చేస్తుందా చేయదా? నా ఆటలో అది ఎలా ఇముడుతుంది వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి పజిల్ పూర్తి చేయాలి" అని లబుషేన్ చెప్పాడు. ఇండియాలో ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా నేరుగా టెస్ట్ సిరీస్ బరిలోకి ఆస్ట్రేలియా దిగబోతోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో మ్యాచ్ ప్రారంభానికి వారం ముందే ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు రానుంది.
సంబంధిత కథనం