Kapil Dev on Bumrah: బుమ్రా వరల్డ్ కప్ ఆడకపోతే ఏం లాభం.. అతనిపై టైమ్ వేస్ట్ చేసినట్లే: కపిల్ దేవ్
31 July 2023, 13:39 IST
- Kapil Dev on Bumrah: బుమ్రా వరల్డ్ కప్ ఆడకపోతే ఏం లాభం.. అతనిపై టైమ్ వేస్ట్ చేసినట్లే అని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రాతోపాటు పంత్ ఫిట్‌నెస్ పై అతడు స్పందించాడు.
మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
Kapil Dev on Bumrah: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయం గురించి ఏడాదిగా చర్చ జరుగుతోంది. గతేడాది సెప్టెంబర్ లో ఇండియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన బుమ్రా.. అప్పటి నుంచి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ ఏడాది ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి టోర్నీలు ఉన్న నేపథ్యంలో బుమ్రా ఆలోపు పూర్తి ఫిట్‌నెస్ తో తిరిగి జట్టులోకి వస్తాడా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో బుమ్రా గాయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "బుమ్రాకు ఏమైంది? అతడు ఎంతో నమ్మకం కలిగించాడు. కానీ వరల్డ్ కప్ ఆడకపోతే ఏం లాభం. అతనిపై మనం టైమ్ వేస్ట్ చేసినట్లే. రిషబ్ పంత్ గొప్ప క్రికెటర్. అతడు ఉండి ఉంటే మన టెస్ట్ క్రికెట్ ఇంకా మెరుగ్గా ఉండేది" అని ది వైర్ తో మాట్లాడుతూ కపిల్ అన్నాడు.
"దేవుడి దయ వల్ల నేనెప్పుడూ గాయపడలేదు. కానీ ఇప్పుడు ఏడాదిలో పది నెలలు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాగోగుల గురించి పట్టించుకోవాలి. ఐపీఎల్ గొప్పదే అయినా.. అదే ప్రతికూల ప్రభావం కూడా చూపించొచ్చు. గాయం చిన్నదే అయినా ఐపీఎల్లో ఆడతారు. అదే గాయం చిన్నదే అయితే ఇండియాకు ఆడరు. కచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి.
చిన్న గాయమే అయితే ఐపీఎల్లో ముఖ్యమైన మ్యాచ్ ఉంటే ఆడతారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బోర్డు వాళ్లు ఎంత క్రికెట్ ఆడాలో తేల్చాలి. ఇవాళ క్రికెట్ బోర్డు దగ్గర డబ్బు, వనరులు ఉన్నా.. మూడు లేదా ఐదేళ్ల కేలండర్లు లేవు. ఇక్కడే బోర్డులో ఏదో లోపం కనిపిస్తోంది" అని కపిల్ అన్నాడు.
బుమ్రా గురించి ఈ మధ్యే బీసీసీఐ కార్యదర్శి జై షా సానుకూలంగా స్పందించాడు. అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడని, ఐర్లాండ్ టూర్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఆ లెక్కన అతడికి ఆసియా కప్, వరల్డ్ కప్ ముందు ఎంతో అవసరమైన మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది.