Jay Shah on Bumrah: బుమ్రా గురించి గుడ్ న్యూస్ చెప్పిన జై షా
28 July 2023, 12:26 IST
- Jay Shah on Bumrah: బుమ్రా గురించి గుడ్ న్యూస్ చెప్పాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడని, ఐర్లాండ్ సిరీస్ కు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పడం విశేషం.
టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా
Jay Shah on Bumrah: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయన కామెంట్స్ చూస్తే అతి త్వరలోనే బుమ్రా తిరిగి ఇండియన్ టీమ్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.
"బుమ్రా పూర్తి ఫిట్ గా ఉన్నాడు. అతడు ఐర్లాండ్ సిరీస్ లో ఆడే అవకాశం ఉంది" అని క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ జై షా చెప్పాడు. ఐర్లాండ్ తో ఇండియా ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్, వరల్డ్ కప్ లాంటి ముఖ్యమైన టోర్నీలకు ముందు బుమ్రా టీమిండియాలోకి తిరిగొచ్చి గాడిలో పడటానికి ఐర్లాండ్ సిరీస్ బాగా ఉపయోగపడనుంది.
అందుకే ఈ సిరీస్ కు మిగతా సీనియర్లు లేకపోయినా బుమ్రాను మాత్రం పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. జై షా కామెంట్స్ చూస్తే బుమ్రా ఐర్లాండ్ ఫ్లైటెక్కడం ఖాయం. బుమ్రా ఫిట్‌నెస్ పై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించిన విషయం తెలిసిందే. అతని గురించి తాము ఎప్పటికప్పుడు నేషనల్ క్రికెట్ అకాడెమీతో టచ్ లో ఉన్నామని, ఇప్పటి వరకైతే పరిస్థితులు సానుకూలంగానే ఉన్నట్లు రోహిత్ చెప్పాడు.
మరోవైపు బుమ్రా గురించే కాదు.. ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కు ప్రత్యేకంగా బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లు ఉండాలన్న అంశంపైనా జై షా స్పందించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్వ్యూలు ముగిశాయని, త్వరలోనే నియామకాలు జరుగుతాయని చెప్పారు. ఇండియా మెన్, వుమెన్ టీమ్స్ కు సంబంధించి ఇలాంటి ఇంటర్వ్యూలు క్రికెట్ అడ్వైజరీ కమిటీ చేస్తుంది.