Rinku Singh: ఐర్లాండ్ సిరీస్‌కు రింకు సింగ్.. సెలక్షన్ కమిటీ ప్లాన్ ఇదీ-rinku singh to fly for ireland reveals a bcci source ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rinku Singh: ఐర్లాండ్ సిరీస్‌కు రింకు సింగ్.. సెలక్షన్ కమిటీ ప్లాన్ ఇదీ

Rinku Singh: ఐర్లాండ్ సిరీస్‌కు రింకు సింగ్.. సెలక్షన్ కమిటీ ప్లాన్ ఇదీ

Hari Prasad S HT Telugu
Jul 07, 2023 12:14 PM IST

Rinku Singh: ఐర్లాండ్ సిరీస్‌కు రింకు సింగ్ ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ ప్లాన్ ఏంటో తాజాగా ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన రిపోర్ట్ లో తెలిపింది.

రింకు సింగ్
రింకు సింగ్

Rinku Singh: వెస్టిండీస్ టూర్ కు యంగ్ సెన్సేషనల్ బ్యాటర్ రింకు సింగ్ ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని ఐర్లాండ్ టూర్ కు పంపించాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. అందరు యువ ఆటగాళ్లను ఒకే సిరీస్ కు ఎంపిక చేయకుండా ఒక్కో సిరీస్ కు కొంత మంది ప్లేయర్స్ ను ట్రై చేయాలన్నది కమిటీ ఆలోచనగా కనిపిస్తోంది.

ఐర్లాండ్ తో టీమిండియా వచ్చే నెలలో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో ఈ మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం రింకు సింగ్ తోపాటు రుతురాజ్ గైక్వాడ్ ను కూడా ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతంగా రాణించిన రింకుని వెస్టిండీస్ టూర్ కు ఎంపిక చేయలేదు.

తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ కు విండీస్ తో ఆడే టీ20 జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ కు మిగతా వాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు. "ఐపీఎల్లో రాణించిన రింకు, ఇతర ప్లేయర్స్ ఐర్లాండ్ వెళ్తారు. ఒకేసారి అందరు యువకులకు అవకాశం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ అనుకోవడం లేదు. వన్డే జట్టులో ఉన్న ఏడుగురు ప్లేయర్స్ టీ20లు ఆడటం లేదు. వాళ్లు ఆగస్ట్ లో జరగబోయే ఆసియాకప్ కోసం సిద్ధం కావాల్సి ఉంది" అని బీసీసీఐ అధికారి తెలిపారు.

టీ20ల్లో ఇప్పటికే రోహిత్, విరాట్ లాంటి సీనియర్లను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ సమయానికి ఓ బలమైన జట్టును తయారు చేసే ఉద్దేశంతో ఒక్కో సిరీస్ కు కొంతమంది యువ ప్లేయర్స్ కు అవకాశం కల్పించనున్నారు. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గుజరాత్ టైటన్స్ పై చివరి ఐదు బంతులు సిక్స్ లుగా మలచి గెలిపించిన రింకు సింగ్.. తర్వాత కూడా మంచి ఫినిషర్ రోల్ ప్లే చేశాడు. ఐర్లాండ్ సిరీస్ లో అవకాశం దక్కితే తనను తాను నిరూపించుకోవడానికి రింకూకి మంచి అవకాశం దక్కుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం