Rohit Sharma on Bumrah: బుమ్రా వచ్చేస్తున్నాడా.. రోహిత్ తేల్చేశాడు-cricket news rohit sharma hopes bumrah will play before world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma On Bumrah: బుమ్రా వచ్చేస్తున్నాడా.. రోహిత్ తేల్చేశాడు

Rohit Sharma on Bumrah: బుమ్రా వచ్చేస్తున్నాడా.. రోహిత్ తేల్చేశాడు

Hari Prasad S HT Telugu
Jul 27, 2023 10:15 AM IST

Rohit Sharma on Bumrah: బుమ్రా వచ్చేస్తున్నాడా? ఐర్లాండ్ సిరీస్ ఆడతాడా? ఈ ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానం ఇచ్చాడు. అతడు వరల్డ్ కప్ కంటే ముందు ఫీల్డ్ లో దిగుతాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా
రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా (AP/File Photo)

Rohit Sharma on Bumrah: సుమారు ఏడాది కాలంగా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సేవలను టీమిండియా మిస్ అవుతోంది. మొత్తానికి ఇప్పుడు అతని గురించి కాస్త గుడ్ న్యూస్ వస్తోంది. వచ్చే నెలలో జరగబోయే ఐర్లాండ్ సిరీస్ తో బుమ్రా కమ్‌బ్యాక్ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా. ఇప్పటికే అతడు నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

ఇక తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బుమ్రాపై కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్.. బుమ్రా గురించి అడిగిన ప్రశ్నపై స్పందించాడు. ఐర్లాండ్ సిరీస్ లో అతడు ఆడతాడా లేదా అన్నదానిపై తనకు సమాచారం లేదని, అయితే వరల్డ్ కప్ కు ముందు కొన్ని మ్యాచ్ లు ఆడతాడని ఆశిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు.

"బుమ్రా అనుభవం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం అతడు తీవ్రమైన గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఐర్లాండ్ సిరీస్ కు వెళ్తాడా లేదా తెలియదు. ఎందుకంటే జట్టును ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఆడితే మంచిదే. వరల్డ్ కప్ కంటే ముందు అతడు ఆడాలని ఆశిస్తున్నాం. ఓ ప్లేయర్ తీవ్రమైన గాయం నుంచి తిరిగి వస్తున్నప్పుడు మ్యాచ్ ఫిట్‌నెస్, మ్యాచ్ ఫీలింగ్ ముఖ్యమైన అంశాలు. ఇప్పుడవే మిస్ అవుతున్నాయి" అని రోహిత్ అన్నాడు.

ఇక బుమ్రా ఫిట్‌నెస్ గురించి కూడా రోహిత్ గుడ్ న్యూస్ చెప్పాడు. "అంతా అతడు కోలుకోవడంపై ఆధారపడి ఉంది. నేషనల్ క్రికెట్ అకాడెమీతో మేము మాట్లాడుతూనే ఉన్నాం. ప్రస్తుతానికి సానుకూల పరిస్థితులే ఉన్నాయి" అని రోహిత్ చెప్పడం విశేషం. గతేడాది ఆసియా కప్ కూడా బుమ్రా ఆడలేదు. అంతకుముందు అతడు వెన్నుగాయానికి గురయ్యాడు.

తర్వాత అతనికి సర్జరీ కూడా జరిగింది. ఈ ఏడాది శ్రీలంకతో వన్డే సిరీస్ కే తిరిగి వస్తాడని భావించారు. మొదట అతన్ని ఎంపిక చేసిన సెలక్టర్లు మళ్లీ పక్కన పెట్టారు. ప్రస్తుతం అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. ఐర్లాండ్ తో సిరీస్ ఆడితే.. తర్వాత ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లు కూడా బుమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ కప్ కు ముందు ఈ సిరీస్ లు బుమ్రాకు మంచి అవకాశమనే చెప్పాలి.

WhatsApp channel

సంబంధిత కథనం