India vs Pakistan WC 2023: వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలో మార్పు.. కారణమిదే!
India vs Pakistan WC 2023: వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలో మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
India vs Pakistan WC 2023: రానున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీలో మార్పు జరగవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. అక్టోబర్ 15 నవరాత్రుల్లో తొలి రోజు కావడంతో ఆ రోజును మార్చే అవకాశం ఉంది.
గుజరాత్ లో చాలా ఘనంగా నిర్వహించే ఈ నవరాత్రి ఉత్సవాలతో ఈ మ్యాచ్ కు ఎలాంటి భద్రత ముప్పు రాకూడదన్న ఉద్దేశంతో ఈ మ్యాచ్ తేదీ మార్చాలని భావిస్తున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఇప్పటికే పలు ఏజెన్సీలు మ్యాచ్ ను రీషెడ్యూల్ చేయాల్సిందిగా బీసీసీఐని కోరినట్లు కూడా ఆ రిపోర్టు తెలిపింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
"మాకున్న అవకాశాలపై చర్చిస్తున్నాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇండియా, పాకిస్థాన్ లాంటి హై ప్రొఫైల్ మ్యాచ్ కోసం వేల మంది అభిమానులు అహ్మదాబాద్ కు వస్తారని, నవరాత్రి సమయంలో ఈ మ్యాచ్ జరగడం వల్ల ఇబ్బంది అవుతుందని భద్రతా ఏజెన్సీలు మాకు చెప్పాలి" అని ఓ బీసీసీఐ అధికారి అన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ తెలిపింది.
ఒకవేళ ఈ మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందే. సుమారు లక్ష మంది అభిమానులు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ చూడనున్నారు. ఇప్పటికే చాలా మంది అక్టోబర్ 15 కోసం అహ్మదాబాద్ లో వసతి కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు. అది కూడా సాధారణ ధరల కంటే పది రెట్లు ఎక్కువ చెల్లించారు. వీళ్లలో ఎన్నారైలు కూడా ఉన్నారు.
ఇప్పుడు మ్యాచ్ మరో తేదీకి వాయిదా పడితే అన్ని వేల మంది ఒకేసారి ఆ బుకింగ్స్ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు ఇప్పటికీ ఈ మ్యాచ్ తోపాటు వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. దీనిపైనే అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఇండోపాక్ మ్యాచ్ వాయిదా వేస్తే వారి నుంచి బీసీసీఐకి మరిన్ని తిప్పలు తప్పవు.
మరోవైపు వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చే అన్ని వేదికల సభ్యులను గురువారం (జులై 27) న్యూఢిల్లీలో సమావేశానికి రావాల్సిందిగా బీసీసీఐ సెక్రటరీ జై షా కోరారు. ఈ సమావేశంలోనే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సంబంధిత కథనం