Kapil Dev on World Cup: వరల్డ్ కప్ గెలవాలంటే ఇలా చేయండి: కపిల్ దేవ్ సూచన
Kapil Dev on World Cup: వరల్డ్ కప్ గెలవాలంటే ఇలా చేయండి అంటూ టీమిండియాకు కపిల్ దేవ్ సూచించాడు. 40 ఏళ్ల కిందట తొలి వరల్డ్ కప్ అందించిన ఈ మాజీ కెప్టెన్ ఇండియా అవకాశాలను బేరీజు వేశాడు.
Kapil Dev on World Cup: స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ను ఇండియా గెలుస్తుందా? పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువుకు తెరదించుతుందా? కోట్లాది అభిమానులు ఎంతో ఆతృతగా ఈ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు తొలిసారి 1983లో వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్.. రోహిత్ సేనకు ఉన్న అవకాశాలపై స్పందించాడు.

2011లో చివరిసారి వరల్డ్ కప్, 2013లో చివరిసారి ఓ ఐసీసీ ట్రోఫీ (ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన టీమిండియా.. అప్పటి నుంచీ మరో ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈసారి జట్టుపై ఉన్న భారీ అంచనాలను తట్టుకొని నిలబడితేనే ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు. కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గోల్ఫ్ ఫిట్టింగ్ సెంటర్ లాంచ్ సందర్భంగా కపిల్ మాట్లాడాడు.
ఆ అంచనాలను అధిగమిస్తేనే..
"వరల్డ్ కప్ లో ఇండియా అవకాశాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. వాళ్లు ఇంకా జట్టును ప్రకటించలేదు. చాలా కాలంగా ఇండియా ప్రతి టోర్నీలోనూ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. అన్ని వైపుల నుంచి ఉన్న భారీ అంచనాలను తట్టుకొని ఎలా నిలబడతారన్నదానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచాం. ఎవరిని ఎంపిక చేసినా ఇప్పుడు కూడా మరోసారి వరల్డ్ కప్ గెలిచే సత్తా టీమిండియాకు ఉంది. నాలుగేళ్లకోసారి వరల్డ్ కప్ వస్తుంది. ప్లేయర్స్ దీనికోసం పూర్తిగా సిద్ధమయ్యారని భావిస్తున్నా" అని కపిల్ అన్నాడు.
టీమిండియాను వేధిస్తున్న గాయాలపై కూడా అతడు స్పందించాడు. తన కెరీర్లో 131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్.. ఎప్పుడూ గాయం కారణంగా జట్టుకు దూరం కాలేదు. అయితే ఈ కాలంలో ఆడుతున్న క్రికెట్ ను చూస్తే పనిభారం, గాయాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కపిల్ అన్నాడు.
"మా కాలం వేరు. మేము చాలా తక్కువ క్రికెట్ ఆడాము. కానీ ఇప్పటి ప్లేయర్స్ 10 నెలలపాటు క్రికెట్ ఆడుతున్నారు. అందువల్ల గాయాలకు దూరంగా ఉండాలంటే అందుకు తగినట్లు శరీరాన్ని మలచుకోవాలి. ప్రతి ఒక్కరి శరీరం వేరు. వాళ్లు తమ ఫిట్‌నెస్ ను కాపాడుకునేందుకు వేర్వేరు ప్లాన్స్ తో ఉండాలి" అని కపిల్ స్పష్టం చేశాడు.
వెస్టిండీస్ లేకపోవడం బాధ కలిగిస్తోంది
ఇక 1983లో అప్పటి హాట్ ఫేవరెట్ వెస్టిండీస్ ను ఓడించి తొలిసారి ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు కపిల్ దేవ్. అలాంటి విండీస్ ఇప్పుడు కనీసం వరల్డ్ కప్ కు క్వాలిఫై కాకపోవడంపై కూడా అతడు స్పందించాడు. "వెస్టిండీస్ వరల్డ్ కప్ ఆడకపోవడం చాలా బాధగా ఉంది.
వాళ్లు లేని వన్డే టోర్నమెంట్ ఊహించడం కష్టం. వాళ్లు అంత గొప్ప ప్లేయర్స్ ను అందించారు. ఇప్పుడు వాళ్లు ఎందుకిలా ఆడుతున్నారో తెలియదు. కానీ వాళ్లు బలంగా పుంజుకుంటారని మాత్రం భావిస్తున్నాను" అని కపిల్ అన్నాడు.
సంబంధిత కథనం