Ashwin World Number 1 Bowler: అశ్విన్ వరల్డ్ నంబర్ 1 బౌలర్.. ఆండర్సన్‌ను వెనక్కి నెట్టిన స్పిన్నర్
01 March 2023, 14:50 IST
- Ashwin World Number 1 Bowler: అశ్విన్ వరల్డ్ నంబర్ 1 బౌలర్ అయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ వెటరన్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టాడు ఈ టీమిండియా స్టార్ స్పిన్నర్.
టీమిండియా స్పిన్నర్ అశ్విన్
Ashwin World Number 1 Bowler: ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. తాజాగా ఐసీసీ బుధవారం (మార్చి 1) రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను వెనక్కి నెట్టి అశ్విన్ టాప్ లోకి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించిన అశ్విన్.. నంబర్ వన్ గా ఎదిగాడు.
ఇక న్యూజిలాండ్ చేతుల్లో ఒక పరుగు తేడాతో ఇంగ్లండ్ ఓడిన విషయం తెలిసిందే. దీంతో ఆ టీమ్ బౌలర్ ఆండర్సన్ రెండోస్థానానికి దిగజారాడు. 2015లో తొలిసారి టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్న అశ్విన్.. మళ్లీ సుమారు 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు టాప్ ర్యాంక్ చేజిక్కించుకున్నాడు. స్పిన్నర్లు రాజ్యమేలుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ తన ర్యాంక్ ను మరింత పదిలం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
గత మూడు వారాలుగా టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ మారుతూ వస్తోంది. మొదట ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నంబర్ వన్ గా ఉండగా.. గతవారం ఆండర్సన్ ఆ ర్యాంక్ అందుకున్నాడు. ఇక తాజాగా అతన్ని వెనక్కి నెట్టి అశ్విన్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ఇక గతేడాది ఆగస్ట్ నుంచి ఇండియన్ టీమ్ కు దూరంగా ఉన్న బుమ్రా నాలుగో ర్యాంకులో ఉన్నాడు.
పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది ఐదోస్థానంలో, ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ ఆరోస్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పది వికెట్లు తీసిన జడేజా తాజా ర్యాంకుల్లో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ల లిస్ట్ లో మాత్రం జడేజా టాప్ లో కొనసాగుతుండగా.. అశ్విన్ రెండోస్థానంలో ఉన్నాడు.
ఇక టెస్టు బ్యాటర్ల ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 16వ ర్యాంకులో ఉన్నాడు.