Jadeja | టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానానికి జడేజా.
టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్ల విభాగంలో తొలి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. జేసన్ హోల్డర్(వెస్టిండీస్) రెండో స్థానానికి దిగజారాడు.
ఇటీవల శ్రీలంక టెస్టు సిరీస్ రవీంద్ర జడేజా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు. ముఖ్యంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో విధ్వంసమే సృష్టించాడు. ఫలితంగా 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాకుండా 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజుల అతడి స్థానాన్ని వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ భర్తీ చేయడంతో జడ్డూ రెండో స్థానానికి దిగజారాడు. తాజాగా రవీంద్ర జడేజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో మరోసారి నెంబర్ వన్ ర్యాంకుకు చేరాడు.
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌లో టెస్టు సిరీస్ విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు, ఒకే ఒక్క వికెట్ తీయడంతో రెండో స్థానానికి దిగజారాడు. దీంతో మరోసారి జడ్డూ అగ్రస్థానానికి ఎగబాకాడు. 385 పాయింట్ల జడ్డూ నెంబర్ వన్ స్థానానికి చేరగా.. జేసన్ హోల్డర్ 357 పాయింట్ల జడ్డూ తర్వాతి స్థానాకి దిగజారాడు. వీరిద్దరి మధ్య 28 పాయింట్ల వ్యత్యాసముంది.
శ్రీలంకతో సిరీస్ సందర్భంగా అగ్రస్థానానికి చేరిన జడేజా.. వారం పాటు ఆ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అనంతరం హోల్డర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. తాజాగా మరోసారి జడ్డూ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం మరో రెండు నెలల పాటు టెస్టు సిరీస్‌లు లేకపోవడంతో మరికొన్ని రోజుల పాటు జడ్డూ అగ్రస్థానంలో కొనసాగే అవకాశముంది.
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ జడేజా 175 పరుగులతో అద్భుత శతకాన్ని చేశాడు. అనంతరం బౌలింగ్‌లో 5.41, 4/46 లాంటి మెరుగైన గణాంకాలు నమోదు చేశాడు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. మార్చి 26న చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కానుంది.
బ్యాటింగ్ విభాగంలో మొదటి ఐదు స్థానాల్లో లబుషేన్, రూట్, స్మిత్, విలియమ్సన్, బాబర్ ఆజం ఉన్నారు. బాబర్ ఆజం టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా అద్భుత ప్రదర్శన చేస్తున్న బాబర్ 779 పాయింట్లతో మూడు పాయింట్లు ఎగబాకాడు. ఇంక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 885 పాయింట్లతో తొలిస్థానానికి చేరుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. బుమ్రా 830 పాయింట్లతో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్