Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు? ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? విశిష్టత ఏంటి?
16 May 2024, 16:12 IST
- Mohini ekadashi 2024: ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది. దీని విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.
మోహినీ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది?
Mohini ekadashi 2024: హిందూ మతంలో మోహినీ ఏకాదశి ఒక ముఖ్యమైన పండుగ. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏడాది మే 19న మోహినీ ఏకాదశి వచ్చింది.
మోహినీ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాయ అనే ఉచ్చు నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని చెబుతారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు కూడా నశిస్తాయి. మోహినీ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.
మోహినీ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది
క్షీర సాగర మథనం చేసే సమయంలో అమృతం బయటకు వచ్చింది. అయితే అమృతం కోసం అటు దేవతలు, ఇటు అసురుల మధ్య పోటీ నెలకొంది. దేవతల కంటే ఆసురులు బలవంతులుగా ఉన్నారు. దీంతో అసురులను ఓడించలేకపోయారు. సకల దేవతల కోరిక మేరకు మహా విష్ణువు మోహినీ రూపం ధరించి అసురులను తన మాయ అనే ఉచ్చులో బంధించాడు. అసురుల చేతికి చిక్కకుండా దేవతలకు అమృతం అందేలా చేశాడు. అందుకే ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు.
మోహినీ ఏకాదశి తిథి
ఏకాదశి తిథి ప్రారంభం మే 18 ఉదయం 11.23 గంటల నుంచి ముగింపు మే 19 మధ్యాహ్నం 1:50 గంటలకు.
మోహినీ ఏకాదశి వ్రత కథ
ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఐదుగురు కుమారులు. వారిలో చిన్న కుమారుడు దృష్టబుద్ధి. ఇతను చాలా పాపాత్ముడు, అధర్మం పాటిస్తాడు. పాప కార్యాలు ఎక్కువగా చేస్తాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కొడుకును ఇంటి నుంచి గెంటేశాడు. అతను నిరాశ్రయుడుగా ఉన్నప్పుడు స్నేహితుల కూడా అతన్ని విడిచిపెట్టారు.
దృష్టబుద్ధి ఆకలి దప్పులతో అల్లాడుతూ కౌండిల్యుడి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటాడు. అది వైశాఖ మాసం. రిషి గంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కలు అతని మీద పడటంతో జ్ఞానం వచ్చింది. కౌండిల్య మహర్షికి నమస్కరించి తన ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకుంటాడు.
కౌండిల్యుడు దృష్టబుద్ధిపై జాలిపడి వైశాఖ మాసంలో వచ్చే మోహినీ ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు. ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణాలు పొందుతారని చెబుతారు. ఆ విధంగా దృష్టబుద్ధి మోహినీ ఏకాదశి ఉపవాసం ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావంతో పాపరహితుడు అయ్యాడు. జీవిత చరమాంకంలో గరుడపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్ళాడు.
మోహినీ ఏకాదశి ప్రాముఖ్యత
మోహినీ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోతాయి. పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించి సంతోషకరమైన జీవితం గడుపుతారు. మనసు శుద్ధి అవుతుంది. ఆత్మకు శాంతి లభిస్తుంది. ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు సూర్య పురాణం చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం జపిస్తూ మోహినీ ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.