Vaishaka ekadashi 2024: ఏకాదశి రోజు అన్నం తినకూడదని ఎందుకు చెప్తారు? దీని వెనుక కారణం ఏంటో తెలుసా?
Vaishaka ekadashi 2024: ఏకాదశి రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదని అంటారు. ఎందుకు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏకాదశి రోజు అన్నం తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.
Vaishaka ekadashi 2024: అన్ని ఉపవాసాలలోకెల్లా ఏకాదశి ఉపవాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో వస్తుండ.
ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. నెలకు రెండు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి వరూథిని ఏకాదశి అంటారు. మే 4వ తేదీ వరూథిని ఏకాదశి వచ్చింది. ఈరోజు విష్ణువుని వరాహమూర్తి అవతారంలో పూజిస్తారు. వరూథిని ఏకాదశి శనివారం జరుపుకోనున్నారు.
సాధారణంగా ఏకాదశి ఉపవాసం పాటించే వాళ్ళు పొరపాటున కూడా అన్నం తీసుకోరు. ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా కూడా అన్నం అనేది ముట్టుకోరు. ఏకాదశి నాడు అన్నం తినడం పాపంగా భావిస్తారు. అలా భావించడం వెనుక పురాణ కథ మాత్రమే కాదు శాస్త్రీయ కారణం కూడా ఉంది.
ఏకాదశి నాడు అన్నం ఎందుకు తినరు?
పురాణాల ప్రకారం ఏకాదశి ఉపవాసం పాటించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది. వైకుంఠ ప్రవేశం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఏకాదశి ఉపవాసం రోజు ఆహారం తీసుకోరు. ఏకాదశి రోజు అన్నం తినడం మాంసం తినడంతో సమానంగా భావిస్తారు. దీని వెనుక పౌరాణిక విశ్వాసం కూడా ఉంది.
పురాణాల ప్రకారం మేధ మహర్షి తన తల్లి కోపానికి గురవుతాడు. దీంతో తన శరీరాన్ని త్యాగం చేసుకుంటాడు. అతని శరీర భాగాలు భూమిలో కలిసిపోతాయి. వరి భూమి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే వరిని మొక్కగా కాకుండా ఒక జీవిగా పరిగణిస్తారు. మేధ మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టిన రోజు ఏకాదశి అనే నమ్ముతారు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం నిషేధం.
ఏకాదశి రోజు అన్నం తింటే మేధ మహర్షి రక్తం, మాంసం తినడంతో సమానంగా భావిస్తారు. అలాగే ఏకాదశి రోజు అన్నం తింటే మరుసటి జన్మలో మనిషి పాముగా జన్మిస్తాడని బలమైన విశ్వాసం ఉంది.
శాస్త్రీయ కారణం
ఏకాదశి నాడు అన్నం తినకపోవడం వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. వరిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీటి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు. అన్నం తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరిగి మనసు చంచలంగా మారుతుంది. ఫలితంగా ఉపవాస నియమాలు పాటించడంలో ఆటంకం ఏర్పడుతుంది. అందుకే ఏకాదశి రోజున బియ్యం, ధాన్యం వంటి వస్తువులు తినడం నిషేధంగా భావిస్తారు.
ఏకాదశి ఉపవాస ప్రయోజనాలు
ఏకాదశి ఉపవాసం ఉంటే ఎటువంటి రోగాలైన నయం అవుతాయి. సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరుతుంది. ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు.
జన్మజన్మల పాపాలు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతాయి. నెలలో వచ్చే రెండు ఏకాదశులను పాటించే వారికి వైకుంఠ ప్రవేశం లభిస్తుందని అంటారు.
బ్రహ్మహత్య పాతకంతో పాటు సకల పాపాలు ఏకాదశి రోజు ధాన్యంలో నివసిస్తాయని అందుకే ఆరోజు అన్నం తినకూడదని కూడా చెబుతారు. ఏకాదశి రోజు మాతృహత్య, పితృహత్య, గురు హత్య వంటి పాపాలను పొందుతాడు. అటువంటి వ్యక్తి ఏనాడూ వైకుంఠాన్ని చేరుకోలేరు. అన్నం తినడం అంటే పాపాన్ని తినడంగా భావిస్తారు.
ఏకాదశి రోజు అన్నం తినే వ్యక్తిని గోమాంసం తినే వ్యక్తిగా పరిగణిస్తారు. పాపాలు చేస్తే మనిషి ఒక్కడే నరకానికి పోతాడు కానీ ఏకాదశి రోజు అన్నం తింటే వాళ్ళు కూతురులతో పాటు నరకానికి వెళ్తారు. అందుకే ఏకాదశి రోజు తర్పణాలు, పిండం పెట్టడం వంటివి చేయరు. ఈరోజు అన్నంతో చేసే పిండదానం పితృదేవతలు స్వీకరించరు.