Vegan Meat: శాకాహార మాంసం గురించి తెలుసా? దాంతో కూర ఇలా వండుకోవచ్చు..
Vegan Meat: శాకాహార మాంసం వెజిటేరియన్లు, వీగన్లకు వస్తున్న ప్రత్యామ్నాయం. దాన్నెలా వండుకోవాలో, దాని వివరాలేంటో పూర్తిగా తెలుసుకోండి.
శాకాహారులు ప్రొటీన్ల కోసం ఎక్కువగా డైరీ ఉత్పత్తుల మీద ఆధార పడుతూ ఉంటారు. మరి వేగన్ డైట్ పాటించే వారికి ఆ ఆప్షన్ కూడా ఉండదు. అందుకనే వీరు ఎక్కువగా ప్రొటీన్ల కోసం వేగన్ మీట్‌ని వాడుతుంటారు. మరి మొక్కల ఆధారితంగా వచ్చే ఆ శాకాహార మాంసం గురించి మీకు తెలుసా? దీన్నే వెజిటేరియన్ మీట్ అనీ, మాక్ మీట్ అనీ పిలుస్తుంటారు. సాసేజ్‌లు, ముక్కలు.. ఇలా రకరకాల ఆకారాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేస్తారో, దాన్ని మనం ఎలా వండుకోవచ్చో తెలుసుకుందాం రండి.
వేగన్ మీట్‌ని దేనితో తయారు చేస్తారు?
శాకాహారులు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కోసం ఎక్కువగా సోయా బీన్స్‌ని వాడుతుంటారు. దీన్ని మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారత దేశపు వంటల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దీనిలో ఎక్కువ ప్రొటీన్, పీచు పదార్థాలు ఉంటాయి. దీన్ని కొంత ప్రోసెస్ చేసి ఈ వేగన్ మీట్‌ని తయారు చేస్తారు. ఇవి గడ్డ కట్టిన ప్యాకెట్ల రూపంలో మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిని కొని తెచ్చుకుని వండుకోవచ్చు. సాధారణంగా మనం మాంసాహారాన్ని ఎలాగైతే వండుకుంటామో దీన్ని కూడా అలాగే వండుకోవచ్చు. బిర్యానీలు, కబాబ్‌లు, బర్గర్‌లు, కూరలుగా చేసుకుని చక్కగా తినవచ్చు. ముందుగా గడ్డ కట్టిన ఈ మాంసాన్ని డీ ఫ్రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఎలా కూర చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
వేగన్ మీట్ మసాలా తయారీ ఇలా :
ముందుగా స్టౌ వెలిగించి కడాయి పెట్టాలి. వేడయ్యాక అందులో రెండు, మూడు స్పూన్ల వరకు నూనెను వేసి వేడి కానివ్వాలి. అందులో రెండు రెమ్మల కరివేపాకు, అర స్పూను జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఈ దశలో అల్లం వెల్లుల్లి ముద్దను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పావు స్పూను గరం మసాలా లేదా చికెన్ మసాలా వేయాలి. రుచికి సరిపడ ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో రెండు టమాటాల్ని తరిగి ముక్కలు వేసుకోవాలి. అది బాగా మగ్గాక వేగన్ మీట్‌ని వేసుకుని ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త నీరు పోసి ఉడకనివ్వాలి. కూర దగ్గరబడి నూనె పైకి తేలుతోంది అనుకున్నప్పుడు కాస్త కొత్తిమీర, కసూరీ మేతీలను వేసి ఒకసారి కలిపి దించేసుకోవచ్చు. ఇది అన్నం, రోటీ, పూరీ, పరాటాలు వేటి లోకైనా బాగుంటుంది.