Magha Pournami 2024: మాఘ పౌర్ణమి రోజు ఏ రాశుల వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే శని ఆశీస్సులు లభిస్తాయి
21 February 2024, 11:41 IST
- Magha Pournami 2024: మాఘ పౌర్ణమి రోజు దానం, స్నానానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఆరోజు ఏ రాశి జాతకులు ఎలాంటి వస్తువులు దానం చేస్తే శని ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం.
మాఘ స్నానం ఆచరిస్తున్న భక్తులు
Magha Pournami 2024: మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేష ప్రాముఖ్యత ఉంటుంది. మాసాలలో కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది మాఘ మాసం. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24న వచ్చింది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినా చేయకపోయినా పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మాఘ కుంభ మేళా కూడా ఫిబ్రవరి 24 తో ముగుస్తుంది.
స్నానం ఆచరించిన తర్వాత దానం చేయడం ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. నువ్వులు, దుప్పట్లు, చెప్పులు, గొడుగు, నెయ్యి, బెల్లం, బట్టలు, శనగలు, ఆహారం వంటి వస్తువులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఇస్తుంది. గోధుమలు దానం చేయడం ఎంతో మంచిదని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని గ్రంథాలలో కూడా పేర్కొన్నారు.
మాఘ పౌర్ణమి రోజున పవిత్ర నది, సరస్సులో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఆరోజు ఉపవాసంతో పాటు సత్యనారాయణుడిని, శ్రీహరి విష్ణువు, శివుడు, హనుమంతుడి ఆరాధన, చంద్రుడి ఆరాధన పురాణాల్లో కనిపిస్తుంది.
"ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" అనే మంత్రాన్ని పఠించాలి. పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున విష్ణువు గంగానదిలో కొలువై ఉంటాడు. అందుకే మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. నిరుపేదలకు, నిస్సహాయులకు అవసరమైన వస్తువులు దానం చేయడం వల్ల శని వల్ల కలిగే అన్ని దోషాలు తొలగిపోతాయి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల బాధల నుంచి విముక్తి కలిగి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఏయే రాశుల వాళ్ళు ఎలాంటి వస్తువులు దానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఆకుపచ్చ కూరగాయాలు, ఉన్ని దుస్తులు, ఆహార ధాన్యాలు దానం చేయడం వల్ల మేష రాశి వారికి మేలు జరుగుతుంది.
వృషభ రాశి
మాఘ పౌర్ణమి రోజు వృషభ రాశి వారు పసుపు వస్త్రాలు, పసుపు ఆవాలు, శనగపప్పు, పప్పు దానం చేయడం ఉత్తమం.
మిథున రాశి
పౌర్ణమి రోజు మిథున రాశి వారికి ప్రయోజనాలు కాలగాలంటే ఎర్ర కాయ ధాన్యాలు, పసుపు పండ్లు, పసుపు రంగు వస్తువులు దానం చేయాలి. వీటితో పాటి నీలం రంగు పువ్వులు దానం చేస్తే మరింత పుణ్యం దక్కుతుంది.
కర్కాటకం
పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత కర్కాటక రాశి జాతకులు బూట్లు, దుప్పట్లు, గొడుగులు, నీలం, నలుపు రంగు దుస్తులు దానం చేయాలి. నలుపు రంగు శనీశ్వరుడికి ఇష్టమైనది. ఈ రంగు వస్త్రాలు దానం చేస్తే శని ఆశీస్సులు పొందుతారు.
సింహం
నీలం రంగు దుస్తులు, నీలం రంగు పూలు, ఆకుపచ్చ కూరగాయలు దానం చేయడం ఉత్తమం.
కన్యా రాశి
మాఘ పౌర్ణమి రోజు గోధుమలు దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కన్యా రాశి జాతకులు గోధుమలు, ఎర్ర పప్పు, రాగి, బెల్లం వంటివి దానం చేయాలి.
తులా రాశి
పసుపు పండ్లు, గంధం, ఇత్తడి వస్తువులు, పసుపు ఆవాలు, వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
వృశ్చికం
మాఘ పౌర్ణమి రోజు వృశ్చిక రాశి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు, క్రీమ్ కలర్ దుస్తులు, గోదానం చేయాలి.
ధనుస్సు
తెల్లని దుస్తులు, ముత్యాలు, పాలు, బియ్యం, పంచదార, తెలుపు రంగు పువ్వులు వంటివి దానం చేస్తే మనశ్శాంతి పొందుతారు.
మకర రాశి
పసుపు ఆవాలు, పసుపు పండ్లు, అరటి, ఇత్తడి వస్తువులు, పసుపు రంగు స్వీట్లు, వస్త్రాలు దానం చేయాలి.
కుంభ రాశి
బియ్యం, పంచదార, పాలు, తెల్ల చందనం, తెల్లని వస్త్రాలు, ముత్యాలు, వెండి వస్తువులు దానం చేయడం శుభదాయకంగా పరిగణిస్తారు.
మీనం
గోధుమలు, ఇత్తడి, ధాన్యాలు, బట్టలు, బెల్లం, నూనె, నీలం రంగు వస్త్రాలు దానం చేయాలి.