తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2024: వృశ్చిక రాశి ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 8, వ్యయం 14

Ugadi Rasi Phalalu 2024: వృశ్చిక రాశి ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 8, వ్యయం 14

HT Telugu Desk HT Telugu

29 March 2024, 13:41 IST

google News
    • Ugadi Rasi Phalalu 2024: వృశ్చిక రాశి ఉగాది రాశి ఫలాలు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్, ప్రేమ జీవితం తదితర అంశాల్లో శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. వృశ్చిక రాశి వారి నెలవారీ ఫలితాలు కూడా ఇక్కడ చూడండి.
Vrischika rashi 2024 Ugadi Rasi Phalalu: వృశ్చిక రాశి ఉగాది రాశి ఫలాలు
Vrischika rashi 2024 Ugadi Rasi Phalalu: వృశ్చిక రాశి ఉగాది రాశి ఫలాలు

Vrischika rashi 2024 Ugadi Rasi Phalalu: వృశ్చిక రాశి ఉగాది రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితములు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నాయని పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

విశాఖ 4వ పాదం, అనూరాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో పుట్టిన వారు వృశ్చిక రాశుల జాతకులు అవుతారు.

శ్రీ క్రోధి నామ నూతన తెలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులకు ఆదాయం 8 పాళ్లు, వ్యయం 14 పాళ్లుగా ఉంది. ఇక రాజ్యపూజ్యం 4 పాళ్లు, అవమానం 5 పాళ్లుగా ఉంది.

శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం మీ రాశిలో బృహస్పతి ఏడవ స్థానమునందు సంచరిస్తున్నాడు. శని 4వ స్థానము నందు సంచరిస్తున్నాడు. రాహువు పంచమ స్థానము యందు, కేతువు లాభ స్థానము నందు సంచరిస్తున్నాడు.

వృశ్చికరాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి కళత్రములో గురుడి అనుకూల ప్రభావం చేత మరియు పంచమంలో రాహువు, లాభములో కేతువు యొక్క అనుకూలత వలన శ్రీ కోధి సంవత్సరంలో మధ్యస్తము నుండి అనుకూల ఫలితములు గోచరిస్తున్నవి.

వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి ఉన్నతాధికారుల మన్ననలు పొందెదరు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారంలో లాభదాయకముగా ఉండును. అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీలకు ఈ సంవత్సరం నూతన గృహారంభం, ధనలాభం, వస్తులాభం కలుగును. ఆరోగ్య విషయాలలో శ్రద్ద వహించాలి.

విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలించును. రాజకీయ రంగంలోని వారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. సినీరంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలున్నాయి. రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి వారి ప్రేమ జీవితం 2024-25

వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించును. జీవిత భాగస్వామితో అనందముగా గడిపెదరు. శారరీక సౌఖ్యం, మానసిక సౌఖ్యం, ఆనందాన్ని ప్రేమ జీవితంలో పొందెదరు.

వృశ్చిక రాశి వారి ఆర్థిక విషయాలు 2024-25

వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా పురోగతి లభించును. అప్పుల బాధలు తగ్గును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి కలుగును.

వృశ్చిక రాశి వారి కెరీర్ 2024-25

వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలించును. కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించును.

వృశ్చిక రాశి వారి ఆరోగ్యం 2024-25

వృశ్చిక రాశి జాతకులు అర్ధాష్టమ శని ప్రభావం చేత గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్య సమస్యల నుండి ఇబ్బందిపడుతున్నారో, కళత్రంలో గురుని ప్రభావం చేత ఆయా అనారోగ్య సమస్యల నుండి బయటపడెదరు. ఆరోగ్య విషయాల్లో మార్పు వచ్చి ఆరోగ్యాభివృద్ధి కలుగును. ఆరోగ్య ఖర్చులు పెరుగును.

చేయదగిన పరిహారాలు

వృశ్చిక రాశి జాతకులు 2024-25లొ మరిన్ని శుభఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం, శనివారం రోజు వేంకటేశ్వరస్వామిని పూజించడం చేయాలి. శనివారం రోజు నవగ్రహాల ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ధరించాల్సిన నవరత్నం: వృశ్చికరాశి వారు ధరించవలసిన నవరత్నం పగడం.

ప్రార్థించాల్సిన దైవం: వృశ్చిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వరుడు.

వృశ్చిక రాశి 2024-25 నెలవారీ రాశి ఫలాలు

ఏప్రిల్‌: ఈ మాసం మీకు అనుకూల సమయం. అనవసర గొడవల్లో చిక్కుకుంటారు. ఆర్థిక విషయాలు సర్దుకుంటాయి. దూర ప్రయాణములు కలసివస్తాయి. నూతన వస్తు, వాహన, వస్తాభరణ లాభాలు. చిన్నపాటి శ్రమకే అలసిపోతుంటారు.

మే: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు ప్రతికూల సమయం. బంధుమిత్రులతో విరోధములు. సంతానమునకు అభివృద్ధి. గృహ ఉపకరణములు కొనుగోలు చేస్తారు. విలాస, సుఖమయ జీవనం గడుపుతారు. ఆదాయం తగ్గుతుంది. శారీరక, మానసిక వాంఛలు ఉంటాయి.

జూన్‌: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వివేకముతో వ్యవహరిస్తారు. విద్యా, సారస్వత రంగాలలో రాణిస్తారు. సంతానం, సోదరులకు శుభములు. అనవసర ఖర్చులు. ఆత్మీయుల ఎడబాటు మానసికంగా కృంగదీస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు.

జూలై: ఈ మాసం వృశ్చిక రాశి జాతకులకు అనుకూలంగా లేదు. మీ తెలివితేటలతో మంచి పనులు చేస్తారు. గతంలో కాని పనులు పూర్తిచేస్తారు. శారీరక, మానసిక అలసటకు గురవుతారు. అయినవారి మధ్య అవగాహనలోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా కళత్రంతో ఘర్షణ వాతావరణం.

ఆగస్టు: ఈ మాసం మీకు మధ్యస్థ సమయం. మానసిక అశాంతి. సంతానానికి, తల్లిదండ్రులకు చెడు సమయం. విద్య, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చివరకు పరిస్థితులు మెరుగుపడతాయి.

సెప్టెంబర్‌: ఈ మాసం మీకు మధ్యస్థం నుండి అనుకూలం. సంఘంలో గౌరవం. శారీరక సౌఖ్యం. వస్త్రాభరణ లాభములు ఉండును. చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు వృద్ధి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు.

అక్టోబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గృహమునందు శుభకార్యములు. స్త్రీ మూలకంగా గొడవలు. సుఖశాంతులకు కొరత ఏర్పడును. పనులు ఆటంకములు. తీవ్ర కష్టనష్టాలకు గురవుతారు.

నవంబర్‌: ఈ మాసం మీకు మధ్యస్థం. వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పట్టును. ఆర్థికంగా అనుకూలం. మానసిక సుఖము. కోరికలన్నీ నెరవేరుతాయి. బంధుమిత్రులు సహాయ సహ కారములు అందిస్తారు.

డిసెంబర్‌: ఈ మాసం వృశ్చిక రాశి జాతకులకు అనుకూలం. తల్లిదండ్రుల సహకారంతో అన్ని పనులు చక్కగా సాగుతాయి. ధనవంతుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. గృహమందు శుభకార్యములు జరుగును.

జనవరి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదర వర్గ మూలక లాభముండును. పనుల ఒత్తిళు ఉండును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనాదాయం బాగుంటుంది. విద్యారంగాల్లో రాణిస్తారు.

ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి. గృహమునందు అనుకూలం. దీర్హకాలిక అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం. ఖరీదైన వాహనాలలో ప్రయాణిస్తారు. సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు.

మార్చి: ఈ మాసం వృశ్చిక రాశి వారి జాతకం అనుకూలంగా లేదు. ప్రభుత్వ అధికారుల నుండి వేధింపులు. కుటుంబము నందు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయట గొడవలు పెరుగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేస్తారు. అధిక వ్యయం. స్నేహితులతో దూరంగా వ్యవహరిస్తారు.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం