నవగ్రహాలు ఎలా దర్శించుకోవాలి? దాని విధి విధానం ఏమిటి?-how to do navagraha darshan and the rules to follow ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవగ్రహాలు ఎలా దర్శించుకోవాలి? దాని విధి విధానం ఏమిటి?

నవగ్రహాలు ఎలా దర్శించుకోవాలి? దాని విధి విధానం ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Jul 29, 2023 05:04 AM IST

నవగ్రహాలు ఎలా దర్శించుకోవాలి? దాని విధి విధానం ఏమిటి? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇవీ.

నవగ్రహాల దర్శనానికి విధివిధానాలు
నవగ్రహాల దర్శనానికి విధివిధానాలు

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మానవుని జీవితంపై నవగ్రహాల ప్రభావం ఖచ్చితముగా ఉంటుంది. ఈ నవగ్రహాల ప్రభావం ప్రకారం శుభ మరియు అశుభ ఫలితాలు మానవునికి కలుగుతుంటాయి. అశుభ ఫలితాలు కలిగేటటువంటి మానవుడు తన జీవితంలో అశుభ ఫలితాలను తగ్గించుకొని శుభఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆరాధన చేయడం మంచిది అని జ్యోతిష్యశాస్త్రం తెలియచేసినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఏవ్యక్తి అయినా నవగ్రహాలను పూజించుకోవాలి అంటే దానికి ఒక విధి విధానం ఉన్నది. నవగ్రహ మూర్తులు ఆలయాలలో ఉంటాయి. విశేషంగా శివాలయాలలో నవగ్రహమూర్తులు, నవగ్రహ మండపం ఉంటాయి. ఇలా నవగ్రహాలను దర్శించేటప్పుడు, ఆ ఆలయంలోనికి ప్రవేశించినపుడు ముందు నవగ్రహాలను దర్శించి, ఆఖరిలో గర్భాలయంలో ఉన్న మూలావిరాట్‌ను దర్శించుకొని వెళ్ళడం నవగ్రహ దర్శన విధి విధానం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నవగ్రహాలను దర్శించేటప్పుడు ఇంటిలో తలస్నానమాచరించి బయలుదేరడం, నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు చేయడం ఉత్తమ విధానం, శాస్త్ర సమ్మతం. కొన్ని సందర్భాలలో ఇలా మీకు చేయలేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు చేయడం మంచిది.

నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తరువాతే మిగిలిన ఆలయాల ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. నవగ్రహాలకు అధినాయకుడు అయిన సూర్యుణ్ణి ప్రప్రథమంగా, తరువాత చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు కేతువులు ఇలా వీరిని దర్శించుకుంటూ వారియొక్క స్తోత్రాలను నామాలను పఠిస్తూ భక్తిశ్రద్ధలతో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఉత్తమమని చిలకమర్తి తెలియచేసారు.

ఇలా నవగ్రహ దర్శనం అయిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రధానాలయంలో మూలవిరాట్‌ను దర్శించి తీర్థ ప్రసాదం వంటివి స్వీకరించి ఇంటికి వెళ్ళడం ఉత్తమం. నవగ్రహ ఆలయాలను దర్శించుకున్నరోజు, ప్రదక్షిణలు ఆచరించిన రోజు ఆహార విషయాలలో నియమాలు పాటించాలి. సాత్విక ఆహారం స్వీకరించడం మరియు దైవచింతనతో ఉండటం వల్ల ఉత్తమఫలితాలు లభిస్తాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner