రేపే పరివర్తని ఏకాదశి- దీని విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు?
13 September 2024, 19:15 IST
- సెప్టెంబర్ 14వ తేదీన పరివర్తని ఏకాదశి జరుపుకోనున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం ఇది చాలా విశిష్టమైనదని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ ఏకాదశి జరుపుకోవడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.
పరివర్తని ఏకాదశి విశిష్టత
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పముపై శయనించిన శ్రీమహావిష్ణువు ఈ రోజున ప్రక్కకు పొర్లుతాడు. అంటే పరివర్తనం చెందుతాడు. శ్రీమహావిష్ణువు పరివర్తనం చెందే ఏకాదశి కనుక పరివర్తన ఏకాదశి అనే పేరు ఏర్పడింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దీనినే పద్మపరివర్తన ఏకాదశి, విష్ణుపరివర్తన ఏకాదశి అంటారు.
లేటెస్ట్ ఫోటోలు
ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కరువు కాటకాలు ఏర్పడవనీ, ఒక్క పొద్దు ఉంటే విముక్తి లభిస్తుందని కథనం. పూర్వం కృతయుగంలో మాంధాత రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఒకసారి, తీవ్రమైన కరువు ఏర్పడి ప్రజలు అష్టకష్టాలు పడసాగారు. ఫలితంగా పండితుల సలహా మేరకు యజ్ఞయాగాలను నిర్వహింపచేసాడు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరకు అంగీరసమహర్షి సలహా మేరకు ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా కరువుకాటకాలు తొలగిపోయి ప్రజలు కష్టాల నుంచి బయటపడ్డారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆషాఢంలో యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణువు ఈ రోజున ప్రక్కకు ఒత్తిగిల్లుతాడని పురాణం. చతుర్మాస్యాలలో ఇది ఒక మలుపు. అత్యంత పవిత్రమైన ఈ దినాన సంధ్యాకాలంలో విష్ణువును పూజించి,
వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ |
పార్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ ॥
అనే మంత్రాన్ని పఠించి ప్రార్థించాలి.
శ్రవణ ద్వాదశి
భాద్రపద శుద్ధ శ్రవణా నక్షత్రంతో కూడితే గొప్ప యోగముంది. వీలైనవారు భాద్రపద ఏకాదశి, ద్వాదశి రెండు రోజులూ ఉపవాస ముండాలి. అందుకు అసమర్థులైనవారు ఏదో ఒక రోజున (ఏకాదశి లేదా ద్వాదశి) ఉపవసించి విష్ణుపూజ చేయాలి.
ఈ రోజున (ద్వాదశి) ఉపవసించి విష్ణువును ఆరాధించిన వారికి ఏకాదశి ఉపవాస పుణ్యం కూడా లభిస్తుందని నారదవచనం. అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఉషోష్య ద్వాదశీం పుణ్యాం విష్ణు ఋక్షేణ సంయుతాం॥
ఏకాదశ్యుద్భవం పుణ్యం నరః ప్రాప్నోత్యసంశయమ్ ॥ (నారదోక్తి)
టాపిక్