కొత్తగా పెళ్లయిన వారు ఆషాఢంలో ఎందుకు కలసి ఉండకూడదు?
కొత్తగా పెళ్లయిన వారు ఆషాఢంలో ఎందుకు కలసి ఉండకూడదో ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆషాఢ మాసాన్ని శూన్యమాసము అంటారు. సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం, తన యొక్క గమనాన్ని దక్షిణ దిశగా మార్చుకోవడం చేత ఈ మాసమునకు శూన్యమాసమని పేరు. ఇటువంటి శూన్యమాసాలలో శుభకార్యాలు నిషేధమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇలాంటి శూన్యమాసంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడు స్థితులు అధికముగా ఉంటాయి.
ఇవే కాకుండా జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఉత్తరాయణము, దక్షిణాయనము ఉంటాయి. ఆయనములు ప్రారంభమైనప్పుడు ఏర్పడు శూన్యమాసాలు కొత్తగా చేయు కార్యాలయాలకు అశుభఫలితాలు ఇస్తాయి. ఈ మాసములో వివాహములు, గృహారంభము, గృహప్రవేశము, వంటి శుభకార్యాలకు, అలాగే నూతనంగా వివాహము జరిగిన దంపతులకు, అత్తాఅల్లుళ్లకు శుభ సమయం కాదు అని శాస్త్రములు తెలిపినవి.
అందుకే ఆషాఢంలో కొత్త దంపతులు కలిసి ఉండకూడదని అంటారు. దీని వెనుక కూడా ఒక అర్ధం ఉంది. పూర్వ కాలంలో వ్యవసాయమే జీవనాధారం. సంపాదన మాట అటు నుంచి తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని, కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు. అంతే కాదు ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్చులు చోటుచేసుకుంటాయి. వేసవి నుంచి ఉపశమనం వచ్చి చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం, ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు.
దీన్ని అనారోగ్య మాసంగా పేర్కొంటారు. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. కాలువల్లోనూ, నదుల్లోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులో పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుందని విశ్వాసం.
అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. ఆషాడంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలలకి అంటే చైత్రం పూర్తవుతుంది. అంటే నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. ఆసమయంలో ఎండలకు.. పుట్టిన పిల్లలు, బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారు.
అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా. పూర్వకాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉదే సంప్రదాయం ఉండేది. కష్టపడి పనిచేయాల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరగవు. వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడిపోవాల్సిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వైపు చూడకూడదనే నియమం పెట్టారు.
-పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ