Nagoba Jatara: నాగోబా జాతర చరిత్ర ఏంటి? అక్కడ జరిగే దర్బార్‌కు ఎందుకంత ప్రాముఖ్యత?
05 February 2024, 9:48 IST
- Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. కొన్ని వందల ఏళ్ల నుంచి జరిగే ఈ జాతరలో చివరి రోజు జరిగే దర్బార్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంతకీ ఆ దర్బార్‌కు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో తెలుసా?
ఆదివాసీల నాగోబా జాతర
అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి నాగోబా జాతర. సర్పజాతిని పూజిస్తూ ఆదివాసులు జరుపుకునే ముఖ్యమైన జాతర ఇది. పుష్యమాసంలో వచ్చే అమావాస్య అర్థరాత్రి నుంచి నాగోబా జాతర మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. నాగోబా జాతరలో పాల్గొనేందుకు చుట్టు పక్కల జిల్లాల నుంచి నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తారు.
గోదావరి జలాల అభిషేకంతో జాతర ప్రారంభం
ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ పుష్యమాస అమావాస్య వచ్చింది. ఈరోజు అర్థరాత్రి నాగదేవతకు మెస్రం వంశీయులు ప్రత్యేకమైన కుండలలో తీసుకొచ్చిన గోదావరి నదీ జలాలతో నాగేంద్రుడికి అభిషేకం చేస్తారు. అమావాస్య రోజు రాత్రి నాగేంద్రుడు నాట్యం చేస్తాడని గిరిజనుల నమ్మకం. శేషనారాయణుడికి పూజ చేసే గిరిజన పూజారులకి పూజ చేసే సమయంలో ఆదిశేషువు కనిపిస్తాడని, వాళ్ళు అందించే పాలు తాగి ఆశీర్వదిస్తాడని నమ్ముతారు. ఈ నాగోబా జాతరలో పాల్గొనేందుకు లక్షల మందితో అరణ్యం మొత్తం నిండిపోతుంది. నాగోబా జాతర జరిగే చివరి రోజు నిర్వహించే దర్బార్ కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన నాగోబా జాతర ఆచారాలు విచిత్రంగా ఉంటాయి. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు నుంచి జాతర ఏర్పాట్లు మొదలవుతాయి. మెస్రం వంశీయులు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అరణ్య మార్గంలో కాలినడకన కలమడుగు సమీపంలోని గోదావరి నుండి ప్రత్యేకమైన కుండలతో నీటిని తీసుకొస్తారు. కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా సుమారు 80 కిలోమీటర్లు వెళతారు. ఆ నీటితోనే నాగోబాని అభిషేకించడంలో జాతర మొదలవుతుంది. ఆరోజు రాత్రంతా నాగదేవతకి పూజలు చేస్తారు.
కుండలు కూడా ప్రత్యేకమే
నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు కుండల ద్వారా గోదావరి జలాలు తీసుకొస్తారు. ఈ కుండలు గుగ్గిల వంశీయులు మాత్రమే నాగోబా జాతర కోసం ప్రత్యేకంగా తయారు చేయడం ఆచారంగా వస్తుంది. పుష్య మాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు కుండల కోసం గుగ్గిల వంశీయుల దగ్గరకి వెళతారు.
వంటకు 22 పొయ్యిలే
జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా కూడా వాళ్ళు వంట చేసుకునేది 22 పొయ్యిల మీదే. ఇవి ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీల్లేదు. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల నుంచి వచ్చే వెలుగులో 22 పొయ్యిల మీద మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వాళ్ళు మాత్రం ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.
దర్బార్ చరిత్ర
నాగోబా జాతర చివర రోజు ఏర్పాటు చేసే దర్బార్ మరింత ప్రత్యేకం. పూర్వం అరణ్య ప్రదేశానికి వెళ్లేందుకు ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడి పరిగెత్తే వాళ్ళు. అందుకే అక్కడికి అధికారులు ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి వీరమరణం పొందాడు. దీంతో ఉలిక్కిపడిన నిజాం ప్రభువులు గిరిజన ప్రాంత ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్‌ను ఆదిలాబాద్ కి పంపించారు. ఆయన దృష్టి జాతర మీద పడింది.
కొండలు, కొనలు దాటి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవడానికి ఈ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అలా మొదటగా 1942 లో తొలిసారి దర్బార్ నిర్వహించారు. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ దర్బార్‌లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తెగల నాయకులు, గిరిజన పెద్దలు, అధికారులు హాజరవుతారు. వారి సమస్యల గురించి తెలుసుకుని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తారు. అందుకే ఈ దర్బార్ చాలా ప్రత్యేకం.
భేటింగ్ కియ్ వాల్
మెస్రం వంశీయులు వివాహమైన నూతన వధువులని తప్పకుండా కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకి తీసుకుని వెళతారు. ఆమె చేత దేవుడికి పూజ చేయించి వధువుణి పరిచయం చేస్తారు. దీనినే భేటింగ్ కియ్ వాల్ అంటారు. అప్పటి వరకు మెస్రం తెగ వధువు నాగోబా దేవుడిని చూడటం, పూజించడం నిషిద్ధం. పరిచయం చేసే వధువుణి భేటీ కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి మొహం కనిపించకుండా తెల్లని వస్త్రాలతో ముసుగు ధరిస్తారు.
నాగోబా పూజ అనంతరం ఆలయం ఆవరణలో ఉన్న పుట్టని మట్టితో మెట్టడంలో మెస్రం వంశీయులు అల్లుళ్లకి పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు ఈ మట్టిని కాళ్ళతో తొక్కితే కూతుర్లు ఆ మట్టితో పుట్టణి అలికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అల్లుళ్లకి నజరానా ఇస్తారు. ఇది అక్కడి సంప్రదాయం.