Medaram History: ఆసియాలోనే అతి పెద్ద జాతర.. సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం-the biggest tribal fair in asia sammakka saralamma jatara ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram History: ఆసియాలోనే అతి పెద్ద జాతర.. సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం

Medaram History: ఆసియాలోనే అతి పెద్ద జాతర.. సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం

HT Telugu Desk HT Telugu
Feb 01, 2024 01:57 PM IST

Medaram History: తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్టమైన గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర అంగరంగవైభవంగా జరుగుతుంది.

మేడారం జాతర మహత్యమిదే
మేడారం జాతర మహత్యమిదే

Medaram History: మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వ తేదీ వరకు ఈ గిరిజన సంప్రదాయ జాతరను కన్నుల పండుగగా జరుగనుంది.

తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు కోటికిపైగా భక్తులు తండోప తండాలుగా ఈ జాతరకు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రతీతి.

ఇదీ నేపథ్యం..

చరిత్రకారులు చెబుతున్న దాన్ని అనుసరించి ఈ జాతర ప్రాశస్త్యం తెలుసుకుందాం. 12వ శతాబ్ధంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడ రాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహము చేశారు.

ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం ఉన్నారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాత వాసం గడుపుతుంటాడు.

మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేసినా సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్ద రాజు, సారక్క, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు.

పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది.

గిరిజన మహిళ యుద్ద నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అదృశ్యమైంది.

సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

ఈ సంవత్సరం జాతర మొదటి రోజైన 2024 ఫిబ్రవరి 21 నాడు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు.

వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యముగా సమర్పించుకుంటారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)

IPL_Entry_Point