Nagoba Jatara: ఆదివాసీల ఆరాధ్య దైవం 'నాగోబా'-arrangements are complete for nagoba jatara idol of tribals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagoba Jatara: ఆదివాసీల ఆరాధ్య దైవం 'నాగోబా'

Nagoba Jatara: ఆదివాసీల ఆరాధ్య దైవం 'నాగోబా'

HT Telugu Desk HT Telugu
Jan 29, 2024 11:14 AM IST

Nagoba Jatara: ఆదివాసి బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకే నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది.

ఆదివాసీల నాగోబా జాతర నిర్వహణకు సర్వం సిద్ధం
ఆదివాసీల నాగోబా జాతర నిర్వహణకు సర్వం సిద్ధం

Nagoba Jatara: ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతర దేశంలోనే ప్రత్యేక జాతరగా చరిత్ర చెబుతోంది. నాగోబా జాతరలో తమ ఇలవేల్పును ఎలా పూజించాలో నేర్పించే ఈ జాతర విశేషాలు ఇలా ఉన్నాయి.

400 ఏళ్లుగా జాతర నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో కొలువైన నాగదేవత నాగోబా జాతర అధ్యంతం కన్నుల పండుగగా కొనసాగుతోంది. ప్రతి ఏటా మెస్రం వంశీయులు సాంప్రదాయాలను గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.

ఏడు తలలతో ఆదిశేషుడు ఇక్కడ కొలువై ఉన్నాడని ఆదివాసి తెగలు నమ్ముతుంటారు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున జరిగే జాతర 15 రోజుల ముందుగానే నెలవంక కనిపించగానే ఆదివాసి మెస్రం వంశీయులు జాతరకు శ్రీకారం చుడతారు .

జాతరకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని గోదావరి నది నుండి నీటిని తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారు. చెప్పులు లేకుండా కాలినడకన 150 కిలోమీటర్ల దూరంలోనే జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపంలోని హస్తినామడుగు గుండం నుండి నీళ్లు తీసుకుని పవిత్ర జలంతో తిరుగు ప్రయాణం చేస్తారు.

సుమారు మూడు నుంచి నాలుగు రోజులు జరిగే క్రతువులో గంగాజలాన్ని ఎక్కడ నేలపై పెట్టరు. గోదావరిలో ఎత్తైన జలాన్ని మోసుకుంటూ వస్తూ తిరిగి ఆలయంలోనే కింద నేలపై ఉంచుతారు. మార్గమధ్యలో చెట్టు ఊడలకు గంగా జలాన్ని కట్టి కాలకృత్యాలు తీసుకుంటారు.

ప్రతి ఏటా కొత్తగా పెళ్లయిన కోడళ్లను నాగదేవతకు పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త కోడలిను ఆదివాసి పెద్దలకు నాగోబాకు పరిచయం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తెల్లని వస్త్రాలు ధరించిన కొత్త కోడలు, 21 రకాల వంటల ద్వారా నాగేంద్రుడికి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు. ఆదివాసీలలో ప్రధాన్ బోయగొట్టి వంశీయులు ఈ నాగోబా జాతర ప్రారంభించి సంప్రదాయ పద్దతిలో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు.

ఈ జాతరకు అవసరమయ్యే మట్టికుండలు నేటికీ తరతరాల నుండి ఒకే వంశీయులు సిరికొండ గ్రామంలో తయారు చేస్తారు. పవిత్ర జలంతో మహా పూజ సందర్భంగా నాగేంద్రుడికి అభిషేకం నిర్వహిస్తారు.

పవిత్ర జలంతో మహిళలు పుట్టలను తయారు చేస్తారు. ఈ పూజా కార్యక్రమాలకు వివిధ రాష్ట్రాల నుండి ఆదివాసీలు తరలి వస్తారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుండి ఆదివాసి తెగలకు చెందిన ప్రజలు హాజరవుతారు.

రాష్ట్రంలో రెండో పెద్ద జాతరగా పేరుగాంచిన నాగోబా జాతర దేశంలోనే ప్రత్యేక హోదా కలిగిన జాతర. ఆదివాసి తెగలు గుస్సాడీ, దంస, మరియు కరవ పాండవుల వేషధారణతో పౌరాణిక కథలు నిర్వహిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలు విని, ఉట్నూర్ ఐటిడిఏ అధికారులు తక్షణం పరిష్కార దిశలో కృషి చేస్తారు. ప్రతి ఏటా జరగే ఈ క్రతువులో జిల్లా స్థాయి అధికారులు మంత్రులు తదితరులు పాల్గొని జాతరను ఘనంగా కొనసాగిస్తారు.

(రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా)