Nagula chavithi 2024: నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు? దీని విశిష్టత ఏంటి?
02 November 2024, 11:22 IST
- Nagula chavithi 2024: కార్తీకమాసంలో వచ్చే పవిత్రమైన పండుగల్లో ఒకటి నాగుల చవితి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నాగుల చవితికి పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు. ఈ పండుగ విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
నాగుల చవితి విశిష్టత
నాగుల చవితి అనేది హిందూ ధార్మిక సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగగా భావించబడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎంతో ఆరాధనీయమైన పర్వదినం. ఈ పండుగను కార్తీక మాసంలో శుక్ల పక్షం చవితి తిథి రోజున జరుపుకుంటారు.
నాగుల చవితి రోజు నాగ దేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలు తొలగించుకోవాలని, కుటుంబ సుఖసంతోషాలు పొందాలని ప్రార్థిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
పౌరాణిక విశిష్టత
నాగుల చవితి పండుగకు సంబంధించిన పౌరాణిక కథలు అనేకం ఉన్నాయి. ప్రముఖంగా సంక్షేప మహాభారతం ప్రకారం యుద్ధం అనంతరం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు జలందరుడి పుత్రుడు అయిన తక్షక సర్ప రాజును సంహరించడంతో, అతని జన్మ సాఫల్యం పొందిందని భావిస్తారు. ఈ నేపథ్యంలో సర్ప దోషం లేకుండా ఉండటానికి నాగుల చవితి రోజు నాగ పూజ చేయాలని పురాణాలు చెబుతాయి చిలకమర్తి తెలిపారు.
ఇంకొక కథ ప్రకారం పూర్వం ప్రజలు పుట్టిళ్ల వద్ద సర్పాల ముప్పుతో ఇబ్బందులు పడుతుండగా నాగ పూజ ద్వారా వారిని రక్షించేందుకు నాగ దేవతలు దీవించినట్లు చెబుతారు. ఈ పూజ చేయడం ద్వారా సర్ప దోషాలు తొలగుతాయని నమ్మకమని చిలకమర్తి తెలిపారు.
నాగ దేవతా పూజ అనేది హిందూ ధార్మిక ఆచారంలో ఎంతో విశిష్టమైనది. సర్పాలను పూజించడం వల్ల సర్ప భయాలు తొలగుతాయని, కుటుంబ శ్రేయస్సు, సంతాన భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. నాగుల చవితి, శ్రావణ మాసంలో నాగ పంచమి రోజుల్లో నాగ దేవతలను పూజించడం సాధారణంగా చేస్తారు. కుండలినీ శక్తిని ప్రతిబింబించే నాగులు, జీవన శక్తిని, విశ్వంలోని రహస్యాలను సూచిస్తారు. పురాణాల ప్రకారం పూర్వ జన్మ పాపాలు లేదా సర్పదోషాల కారణంగా జీవించడానికి నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. నాగ దేవతా పూజ ద్వారా సర్ప దోషం తొలగుతుందని నమ్ముతారు.
నాగ పూజ చేయడం ద్వారా సంతాన సౌభాగ్యం కలుగుతుందని, కుటుంబ సమృద్ధి సాఫల్యంతో నిండిపోతుందని విశ్వసిస్తారు. సంతానం లేని వారు నాగ దేవతలను పూజించడం వల్ల సంతాన సాఫల్యం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి వెల్లడించారు.
నాగుల చవితి ప్రాముఖ్యత
1. సర్ప దోష నివారణ: పురాణాల ప్రకారం మన పూర్వ జన్మ పాపాలు లేదా కుండలినీ శక్తి జాగృతం చేయాలనుకునే వారి కోసం సర్ప దోష నివారణ పూజగా భావిస్తారు. నాగుల చవితి రోజున నాగ దేవతలకు పూజ చేయడం ద్వారా సర్ప దోషాలు తొలగుతాయని, కుండలినీ శక్తి స్థిరంగా ఉండే అవకాశం ఉందని భక్తులు నమ్ముతారు.
2. సంతాన భాగ్యం: సంతానం కలగని వారు నాగుల చవితి రోజు సర్ప దేవతలను పూజించడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుందని, ఆరోగ్యకరమైన జీవితాన్ని దీవిస్తారని విశ్వసిస్తారు.
3. పంటలకు రక్షణ: పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు నాగ దేవతలను పూజిస్తారు. దీనివల్ల పంటలు క్షేమంగా ఉండి, భూమికి సారాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తారు. ఇది పంటల పెరుగుదలకు, పశుపక్ష్యాదులకు రక్షణ కలిగిస్తుంది.
4. ఆరోగ్యం, సుఖశాంతులు: సర్పాల ప్రభావం నుండి బయటపడేందుకు, భయాలు తొలగించుకోవడానికి భక్తులు నాగుల చవితి పూజ చేస్తారు. ఈ పూజ ద్వారా సుఖశాంతులు కలుగుతాయని, సర్పదోషం, వ్యాధి దోషాల నుండి రక్షణ పొందవచ్చని భక్తుల నమ్మకం .
నాగుల చవితి పూజా విధానం
1. ప్రతిమ, పూజా సామగ్రి: నాగుల చవితి పూజకు ప్రత్యేకంగా పుట్టలో ఉన్న నాగ ప్రతిమను లేదా ఏదైనా చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు. దీని ముందు పాలు, తులసి దళాలు, పువ్వులు సమర్పిస్తారు.
2. పాలు, పంచామృతం: నాగుల చవితి రోజు పాలు, పంచామృతం నైవేద్యం అందించడం ముఖ్యమైన ఆచారం. పాలు సమర్పించడం ద్వారా సర్ప దోషాలు తొలగుతాయని నమ్ముతారు.
3. ప్రార్థన: ఈ రోజు సర్పాల పూజ చేసేందుకు శాస్త్రోక్తంగా మంత్రాలను జపిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా సర్పదేవతలకు సంబంధించి పూజా మంత్రాలు చదవడం ద్వారా భక్తి కృతజ్ఞతలు చూపిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.