Naga panchami: నాగపంచమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? గ్రహ దోషాలు తొలగించుకునేందుకు ఏం చేయాలి?
Naga panchami: నాగపంచమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి. ఈరోజు విశిష్టత గురించి ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Naga panchami: శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పంచమి నాగ పంచమిగా చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జాతకచక్రంలో కాలసర్ప దోషంతో బాధపడే వారికి రాహు కేతు దోషంతో ఇబ్బందిపడేవారికి, కుజ దోషం వంటివి ఉన్న వారికి నాగపంచమి రోజు చేసే పూజల వలన నాగ దేవత ఆరాధన వలన ఈ దోషాలకు శాంతి చేకూరుతుందని చిలకమర్తి తెలిపారు.
దోషాలు తొలగించే నాగపంచమి
ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి క్షేత్రంలో నాగదేవతలకు సంబంధించిన ఆలయాన్ని నాగపంచమి రోజే తెరుస్తారని సంవత్సరంలో ఆ ప్రత్యేకమైన రోజే ఆ ఆలయం తెరవబడుతుందని, ఆ సమయంలో ఆలయన్ని సందర్శించిన వారికి రాహు కేతు దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారని చిలకమర్తి తెలిపారు. శ్రావణ మాస శుక్ల పక్ష చవితి రోజు ఉపవాసం ఉండి.. శ్రావణ మాస శుక్ష పక్ష పంచమి రోజు నాగదేవతలను ఆరాధించినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, వైవాహిక జీవితంలో ఉన్న దోషాలు, అనారోగ్య సమస్యలు వంటివి తొలగిపోతాయని చిలకమర్తి తెలిపారు.
నాగపంచమి రోజు ఇంటిలోని గోడకు నాగదేవతల ప్రతిమలు చేసి వాటిని పూజించి, చిమిరి, నువ్వు ఉండలు నివేదన చేసిన వారికి నాగదేవత అనుగ్రహం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు. చమత్కార చింతామణిలో - నాగపూజ యందు షష్ఠితో కూడిన పంచమిని ఆచరించాలని దీనివల్ల నాగులు ఆనందపడతాయని తెలియజేస్తుంది.
నాగ దేవతల ఆరాధన, సుబ్రమణ్యేశ్వర ఆరాధన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢమైన విషయాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలిపారు. యోగీశ్వరులు సైతం ధ్యానంలో సప్త చక్రాలను బంధించేటప్పుడు అజ్ఞా చక్రంలో నిగూఢంగా పరిశీలించినప్పుడు సర్ప రూపం దర్శనమిస్తుందని ఆ సర్పమే హరిషడ్ వర్గాలను(కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మాశ్చర్యం) తొలగించుకుని భాగవత సాక్షాత్కారం పొంది జీవితంలో ముందుకు వెళ్లేందుకు నాగదేవత ఆరాధన చాలా ప్రత్యేకమైనదని చిలకమర్తి తెలిపారు.
నాగపంచమి పరిహారాలు
నాగపంచమి రోజు ఆలయాలలో పుణ్య క్షేత్రాలలో రావి చెట్టు వద్ద ప్రతిష్టించబడిన నాగదేవతల విగ్రహాలను దర్శించడం వాటిని పాలతో నీళ్ళతో అభిషేకించడం. వాటికి పసుపు కుంకుమ సమర్పించడం వల్ల సమస్త నాగదోషాలు, రాహు కేతు దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని చిలకమర్తి తెలిపారు.
భారతీయ సనాతన ధర్మంలో నాగదేవతల పూజ చాలా విశిష్టమైనదని చిలకమర్తి తెలిపారు. సంతాన ప్రాప్తి కోసం సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి కోసం చేసే పూజల్లో నాగదేవత పూజ ఒకటి. అటువంటి నాగదేవత పూజ శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి నాగపంచమి రోజు ఆచరిస్తే వంశాభివృద్ధి, సౌఖ్యం కలుగుతాయని చిలకమర్తి తెలిపారు. నాగపంచమి రోజు సుబ్రమణ్య అలయాలకు వెళ్ళి ప్రత్యేకంగా అభిషేకం చేసిన వారికి సుబ్రమణ్యుని అనుగ్రహం చేత గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
నాగపంచమి రోజు ఉజ్జయిని, శ్రీకాళహస్తి, తిరుత్తణి, తళ్లని వంటి క్షేత్రాలను దర్శించుకోవడం చేత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు. శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి నాగ పంచమి రోజు నాగదేవతలను పూజించి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడిని దర్శించుకున్న వారికి సమస్త కోరికలు నెరవేరి వంశాభివృద్ధి జరుగుతుందని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.