మార్గశిర లక్ష్మీవారం నోము కథ.. వ్రత విశిష్టత తెలుసుకోండి
20 December 2023, 14:56 IST
- మార్గశిర లక్ష్మీవారం నోము కథను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఈ కథ చదివి నోము విశిష్టత, ప్రాముఖ్యత తెలుసుకోండి.
మార్గశిర లక్ష్మీవారం నోము కథ
మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీవ్రతం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరమని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి వివరించారు. మార్గశిర లక్ష్మీవ్రతం నోము కథను ఆయన వివరించారు.
లేటెస్ట్ ఫోటోలు
ఒకానొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తిప్రపత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డలను ఆడించేందుకా బాలికకు అప్పగించి, చిన్న బెల్లం ముక్కని కూడా ఇచ్చేది. ఆ బాలిక ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యం ఉంచేది. కొన్నాళ్ళకా పాప పెద్దదై, పెళ్ళయి, అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతోపాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళి పోయింది. అంతటితో అమె పుట్టింటి వైభవమే తరలిపోయింది.
అత్తింట్లో నిత్యకల్యాణం, పుట్టింట్లో నిత్యదరిద్రం దాపురించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి, వెంటనే తమ్ముణ్ణి రప్పించి, ఒక చేతికర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రనొకచోట పెట్టాడు. అంతలో ఆ దారిన పోయే వారెవరో ఆ కర్రను తీసుకొనిపోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెదుక్కుని కనబడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళ తర్వాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటిపరిస్థితిని అడగ్గా ఎప్పటిలాగే దరిద్రంగానే ఉందని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి, పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇయ్యమని చెప్పి ఇచ్చింది. దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడా కుర్రవాడు. అంతలోనే దారినపోయేవాళ్ళెవరో ఆ చెప్పుల జత అపహరించేశారు. మరల వచ్చిన కుర్రవాడు, చెప్పుల జత కోసం వెదుక్కుని లభించనందున ఎవరికీ ఏమీ చెప్పుకోలేక యింటిదారిపట్టాడు.
మరికొన్నాళ్ళకు అక్క మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటిదగ్గర దరిద్రం యిసుమంతయినా తగ్గలేదని తెల్సుకొని, ఒక గుమ్మడి కాయను దొలిపించి దానినిండా రత్నాలు పోసి, తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమంది. అతడా గుమ్మడి కాయను చెరువు గట్టున ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చేలోపల అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుమ్మడి కాయను తీసుకుపోయాడు. ఆ కుర్రవాడు గట్టుపైకి వచ్చి చూడగా గుమ్మడి కాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంకొన్నాళ్ళు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకొని, వారిని ఉద్ధరించడమెలాగా అని అలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడామె సవతి తల్లితో “అమ్మా! ఈ మార్గశిర లక్ష్మివారము గావున లక్ష్మీదేవి నోము నోచుకుందాము. నువ్వేమీ తినకుండా ఉండు” అని చెప్పింది. తల్లి, సరేనని చెప్పి, చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది.
తీరా, కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి, పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి పోనీలే, వచ్చేవారం చేసుకుందాము. ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మివారము నాడు పిల్లలకు తలంట్లు పోస్తూపోస్తూ ఆ తల్లి గిన్నె మట్టున మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచే సరికి తన తప్పు గురుతొచ్చి ఆ విషయాన్నే చెప్పింది. సరేలే మూడో వారం నోచుకుందువుగానీ.. అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు.
అలాగేనని అన్నదే గాని, ఆ మూడో మార్గశిర లక్ష్మివారం నాడు ఆ తల్లి పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది. కూతురుకు బాధ వేసింది. 'ఇలా అయితే మీ దరిద్రం తీరనూ తీరదు. మీ బ్రతుకులు మారనూ మారవు” అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు, అ నాలుగో లక్ష్మివారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరచి, తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కలపైన కూర్చుని, అరటిపళ్ళు తిని, ఆ తొక్కలను చెక్కల సందులోంచి గోతిలోకి వేశారు. అప్పటికే అకలితో నకనకలాడుతున్న తల్లి, ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది.
కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోటిలో వేసుకున్న సంగతి చెప్పింది తల్లి. కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ అసలా పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తను మరొక పుట్టుక పుట్టాలేమో అని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి “అమ్మా! నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసంలో ఐదు లక్ష్మివారాలొచ్చాయి. చివరి లక్ష్మి వారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు. లేకుంటే నేనేమీ చేయలేను” అని చెప్పేసింది.
అంతేకాదు, అ చివరి లక్ష్మి వారం నాడు తల్లికొంగును తన కొంగుకు ముడివేసుకొని, ఏ అపచారమూ జరగకుండా చూసుకొని, స్నానం చేయించి నోము నోమించింది. కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కానీ, తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు.
అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావిని అడుగగా లక్ష్మీదేవి “అమ్మాయీ! నీ చిన్నతనములో నీవునా బొమ్మతో ఆడుకుంటుండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుకట్టతో కొట్టింది. అందుచేతనే ఈవిడగారి నైవేద్యము నేను తీసుకోవడం లేదు” అని చెప్పింది.
అప్పుడా కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి, తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది.
వచ్చే సంవత్సరమయినా ఈ మార్గశిర లక్ష్మివారముల నోము విధి విధానంగా చేయిమని ఆదేశించింది. కూతురు- తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటికి దరిద్రం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నోటము విధానం: మార్గశిర మాసపు మొదటి రోజు లగాయితు పై కథను చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. ప్రతి లక్ష్మి వారం శీ మహాలక్ష్మిని పూజించాలి.
నైవేద్యాలు ఇలా
మొదటి వారం- పులగం, పరమాన్నం.
రెండవ వారం- అట్లు, పాయసం.
మూడవ వారం- అప్పాలు.
నాలుగవ వారం- కుడుములు
ఐదవ వారం అనగా పుష్య మాసపు మొదటి శుక్రవారం నాడు ఐదుగురు ముత్తైదువులను పూజించాలి. పూర్ణములు, పులిహోర, నేతి పిండివంటలు నివేదించి పేరంటాళ్ళతో సహపంక్తిని భోంచేసి వాయన దానాలివ్వాలి. దీనికి ఉద్యాపన లేదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.