Lord Hanuman: ఈ ఆలయంలో హనుమంతుడిని ఇనుప గొలుసులతో కట్టేసి పూజిస్తారు
10 July 2024, 10:03 IST
Lord hanuman: ఆలయంలో ఎక్కడైన దేవుడిని పూలతో, ఆభరణాలతో అందంగా అలంకరించి పూజిస్తారు. కానీ ఇక్కడ హనుమంతుడిని మాత్రం ఇనుప గొలుసులతో కట్టేసి పూజిస్తారు. ఎందుకో తెలుసా?
ఈ ఆలయంలో హనుమంతుడిని గొలుసులతో కట్టేస్తారు
Lord hanuman: ఒడిశాలోని పూరీ తీరం అనగానే అందరికీ గుర్తొచ్చేది జగన్నాథుడి ఆలయం. అయితే ఇక్కడ ఎన్నో వింతలు, విశేషాలకు నిలయమైన జగన్నాథ ఆలయంతో పాటు మరొక ఆలయం కూడా ఉంది. అదే హనుమంతుడు ఆలయం.
జగన్నాథ దేవాలయానికి దగ్గరలో ఉన్న ఈ హనుమంతుడు ఆలయం కూడా మరెన్నో వింతలకు ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయానికి ఉన్న విశేషమైన ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ హనుమంతుడిని గొలుసులతో బంధించి ఉంచుతారు. అందుకే ఈ హనుమంతుడిని ‘బేడీ హనుమాన్’ అని పిలుస్తారు. బేడీ అంటే గొలుసులు అని అర్థం. ఇది సంయమనానికి చిహ్నంగా భావిస్తారు. శక్తివంతమైన హనుమంతుడిని గొలుసులతో బంధించడానికి గల కారణాలు ఏంటి? ఇలా ఎందుకు చేశారు? అనేదానికి సంబంధించి రెండు ఆసక్తికరమైన కథలు ప్రాచర్యంలో ఉన్నాయి.
ఇక్కడ హనుమంతుడిని దరియా మహావీర్ అని కూడా పిలుస్తారు. దరియా అంటే సముద్రం అని అర్థం. జగన్నాధ ఆలయాన్ని సముద్ర అలల నుంచి రక్షించడంలో హనుమంతుడి పాత్ర ఉందని చెబుతూ హనుమాన్ ఈ విధంగా పిలుస్తారు. ఈ పూరీ జగన్నాథ ఆలయాన్ని కాపాడడం కోసం హనుమంతుడు కాపలాగా ఉంటాడని నమ్ముతారు.
జగన్నాథుడి ఆగ్రహం
జగన్నాథ దేవాలయం సముద్రానికి సమీపంలో ఉన్నందున వాటి అలలు ఆలయం దగ్గరికి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు హనుమంతుడు పూరీ దేవాలయం దగ్గరకు సముద్రపు అలలు రాకుండా కాపాడుతూ ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా హనుమంతుడికి అయోధ్య వెళ్లి శ్రీరాముడిని చూడాలని అపారమైన కోరిక కలిగింది. రాముడుపై తన ప్రేమకు హద్దులు లేవు కనుక వెంటనే హనుమంతుడు ఎవరికీ చెప్పకుండా అయోధ్యకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆలయం దగ్గరకు సముద్రపు అలలు దూసుకు వచ్చాయి. దీంతో ప్రజలు చాలా భయపడిపోయారు. అప్పుడు హనుమంతుడు ఎక్కడ ఉన్నాడని జగన్నాథుడు అడిగినప్పుడు అయోధ్యకు ఆకస్మిక యాత్రకు వెళ్ళాడని చెప్తారు.
విషయం తెలుసుకున్న జగన్నాథుడు వెంటనే హనుమంతుడిని పిలిపించాడు. ఆ సమయంలోనే జగన్నాథు ఆగ్రహించి హనుమంతుడిని గొలుసులతో బంధించి తను ఉండే స్థానాన్ని విడిచిపెట్టకుండా పూర్తి శ్రద్ధతో నగరాన్ని కాపాడమని ఆదేశించారని చెబుతారు.
సముద్ర దేవుడి మోసం
ఇక్కడ హనుమంతుడిని గొలుసులతో బంధించడం వెనుక మరొక ఆసక్తికరమైన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సముద్ర దేవుడైన వరుణ దేవుడు జగన్నాథుడిని దర్శించుకోవాలని అనుకున్నాడు. కానీ అతడు ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినప్పుడల్లా సముద్రపు అలలు అతను వెంట వచ్చాయి. హనుమంతుడు సముద్రం నుండి నగరాన్ని రక్షించే బాధ్యత కలిగి ఉండటం వల్ల జగన్నాథుడిని దర్శించుకోకుండా వరుణ దేవుడిని అడ్డుకున్నాడు.
అయితే ఒక రోజు సముద్ర దేవుడు హనుమంతుడిని మోసం చేశాడు. అందరూ జగన్నాథుని చూస్తున్నారు. నువ్వు ఎప్పుడూ ఇక్కడే నిలబడి ఉంటావా? ఆయన్ని చూడాలని నీకు అనిపించడం లేదా? అని వరుణదేవుడు హనుమంతుడిని ప్రశ్నిస్తాడు. అతని మాటలకు ప్రభావితుడైన హనుమంతుడు తన స్థలం నుంచి దేవాలయం వైపు నడిచాడు. అతని వెంట సముద్రపు అలలతో పాటు వరుణ దేవుడు కూడా వచ్చాడు. అది తెలుసుకున్న జగన్నాథుడు హనుమంతుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించనందుకు కోపంగా అతడిని బంధించాడని చెబుతారు. అలా చేయడం వల్ల హనుమంతుడు ఎప్పటికీ తన స్థానాన్ని వదిలిపెట్టడని ప్రజలను, భగవంతుడిని కాపాడతాడని నమ్ముతారు. అందుకే ఇక్కడ హనుమంతుడిని ఇనుప గొలుసులతో కట్టేసి ఉంచుతారు.