Sri rama navami 2024: ఈ 16 గుణాలే శ్రీరాముడిని ఆదర్శవంతుడిగా చేశాయి.. అవి ఏంటో తెలుసా?
Sri rama navami 2024: శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయనకు ఉన్న ఈ 16 గుణాలే శ్రీరామ చంద్రమూర్తిని సకల గుణాభిరాముడిగా నిలబెట్టాయి. ఆ 16 గుణాలు ఏమిటో తెలుసా?
Sri rama navami 2024: దేవుళ్ళు అవతారాలు ఎత్తి రాక్షసులను సంహరించారు. అయితే శ్రీమహావిష్ణువు ఏడో అవతారం శ్రీరాముడు. మానవుడిగా జన్మించి వారితో పాటు జీవించి అత్యంత సన్నిహితంగా మెలిగాడు. పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. మనిషి ఎదుర్కొనే బాధలు కష్టాలు, సుఖాలు అన్నీ చవిచూశాడు.
ఓసారి నారదుడితో వాల్మీకి మహర్షి నిత్యం సత్యం పలికేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, చేసిన మేలుని మరువకుండా కృతజ్ఞతా భావంతో ఉండేవాడు ఈ లోకంలో ఎవరున్నారని అడిగాడట. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నారదుడు చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రమూర్తి.
జానకి రాముడు, దశరథ రాముడు, కోదండరాముడు, సకల గుణాభిరాముడు, పురుషోత్తముడు, ఏకపత్నీ వ్రతుడు ఇలా ఒకటేంటి సకల గుణాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి శ్రీరాముడు. అందుకే ఆయన్ని ఆదర్శప్రాయుడిగా పిలుస్తారు.
ధర్మం తప్పని వాడిగా, పితృ వాక్య పరిపాలకుడిగా, ప్రజలను తన సొంత బిడ్డలుగా పాలిస్తూ రామరాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తన భార్యని తప్ప పరాయి స్త్రీ నీడ కూడా తన మీద పడనివ్వని ఏక పత్నీ వ్రతుడుగా నిలిచాడు. శ్రీరాముడిలోని ఈ 16 సుగుణాలే అతడిని ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. అవి ఏవంటే..
1. గుణవంతుడు
2. వీర్యవంతుడు
3. ధర్మాత్ముడు
4. కృతజ్ఞతా భావం కలిగిన వాడు
5. సత్యం పలికేవాడు
6. ధృడ సంకల్పం కలిగిన వాడు
7. వేదాంతలు తెలిసినవాడు
8. అన్ని ప్రాణులు మంచే కోరుకునే వాడు
9. విద్యావంతుడు
10. సమర్ధుడు
11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందమైన ముఖవచ్చసు కలిగిన వాడు
12. ధైర్యవంతుడు
13. క్రోధాన్ని జయించినవాడు
14. తేజస్సు కలిగిన వాడు
15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు
16. అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించగలిగేవాడు
ఈ 16 సుగుణాలే శ్రీరాముడిని ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి చెప్పిన వ్యక్తి శ్రీరాముడు. శ్రీరామావతారం దుష్టశిక్షణ కోసం విష్ణువు మానవ రూపము దాల్చాడు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. ఆరోజునే శ్రీరామనవమి జరుపుకుంటారు.
తండ్రి మాటకు విలువిచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేసి ఎన్నో కష్టాలు అనుభవించాడు. శ్రీరాముడు ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శమైన భర్తగా పేరు తెచ్చుకున్నాడు. నిజాయితీగా మెలగాలని, మర్యాదగా మాట్లాడాలని, ఎవరితోను దురుసుగా ప్రవర్తించకూడదని, చిరునవ్వుతోనే పనులు చేయాలని, ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు అలాగే ఎవరికైనా మనం సహాయం చేస్తే వారి నుంచి ప్రతిఫలం ఆశించకూడదని చెప్పడమే కాదు ఆచరించి చూపించాడు. తను ఒక దేవుడిని అని ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు. మానవుడిగా అవతరించి మానవుడిగానే తుది శ్వాస విడిచాడు.
ధర్మ బద్ధమైన జీవితానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు. మనిషి ఇలా బతకాలి అంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. అందుకే శ్రీరాముడిని అందరూ పురుషోత్తముడని పిలిచారు. సర్వోన్నతమైన ఆదర్శాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. రామ నామం ఒక రక్షణ కవచంగా ఉంటుంది. శ్రీరామ రక్షా స్త్రోత్రం నిత్యం పఠించడం వల్ల సకల భయాలు తొలగిపోతాయి.