శ్రావణ మాసంలో ఏ తిథిలో ఏ దేవుడిని పూజించాలి?-shravana masam guide to worshiping the gods according to thithi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రావణ మాసంలో ఏ తిథిలో ఏ దేవుడిని పూజించాలి?

శ్రావణ మాసంలో ఏ తిథిలో ఏ దేవుడిని పూజించాలి?

HT Telugu Desk HT Telugu
Aug 19, 2023 09:16 AM IST

శ్రావణ మాసంలో ఏ తిథిలో ఏ దేవుడిని పూజించాలన్న ధర్మ సందేహానికి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన సమాధానం ఇది.

శ్రావణ మాసంలో తిథుల వారీగా పండగల గురించి ఇక్కడ తెలుసుకోండి
శ్రావణ మాసంలో తిథుల వారీగా పండగల గురించి ఇక్కడ తెలుసుకోండి

శ్రావణమాసం ప్రత్యేక మాసం. శ్రావణమాసంలో ప్రతీరోజు ఒక ప్రాధాన్యమైనటువంటి దినమే అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రావణమాసంలో ప్రతీ తిథికి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఏ తిథిలో ఏ భగవంతుని ఆరాధించాలో అనే అంశాలు స్పష్టంగా తెలుసుకోవాలని చిలకమర్తి తెలిపారు.

సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం “శ్రావణ మాసం”.

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శవణా నక్షత్రం. అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.

శ్రావణమాసంలోని మూడు వారాలు అత్యంత పుణ్య ప్రదమైనవి. “మంగళ, శుక్ర, శనివారాలు” ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి, మహత్తును కలిగినవి. శావణమాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు, శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

రోజువారీగా ఇలా

పాడ్యమి రోజున బ్రహ్మదేవుని ఆరాధించాలి. తదియ రోజున పార్వతీ దేవిని ఆరాధించాలి, చవితి రోజున వినాయకుని పూజించాలి. పంచమి రోజున శని, షష్టి నాగదేవతలను పూజించాలి. సప్తమి రోజున సూర్యుని ఆరాధించాలి. అష్టమి రోజున దుర్గాదేవిని పూజించాలి. నవమి రోజున మాతృదేవతలను పూజించాలి, దశమి రోజున ధర్మరాజును పూజించాలి. ఏకాదశి రోజున మహర్షులను పూజించాలి, ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. త్రయోదశి రోజున అనంగుడను పూజించాలి. చతుర్దశి రోజున పరమశివుని ఆరాధించాలి, పూర్ణిమ రోజున పితృదేవతలను పూజించాలి.

శ్రావణ మాస పర్వదినములు

19-08-23 - మధుశ్రవా వ్రతం,

20-08-28 - నాగ చతుర్ధీ, దుర్వాగణపతి వ్రతం,

21-08-23 - నాగ పంచమి, మంగళగౌరీ వ్రతం, గరుడ పంచమి,

22-08-23 - కల్కి జయంతి, సూర్యపూజ,

25-08-23 - వరలక్ష్మీ వ్రతం, తరిగొండ వెంగమాంబ వర్ధంతి, కౌమారీ దేవీ పూజ,

27-08-28 - సర్వైకాదశి ,

28-08-28 - దామోదర ద్వాదశి,

29-08-28 - బుగ్వేద ఉపాకర్మ, ఓనం పండుగ,

30-08-28 రక్షాబంధన్‌ రాఖీ పండుగ,

31-08-23 శ్రావణ పూర్ణిమ, తైత్తరీయోపాకర్మ, పుబ్బకార్తె, విఖనస జయంతి, హయగ్రీవ జయంతి,

01-09-23 - బృహత్తల్బ ద్వితీయా, అశూన్యశయన వ్రతం, శ్రీ రాఘవేంద్ర ఆరాధన,

03-09-23 - సంకటహర చతుర్ధి,

06-09-23 - స్మార్త శ్రీకృష్ణాష్టమి,

07-09-28 - గోకులాష్టమి, దశఫల వ్రతారంభం,

08-09-23 - కౌమారీ దేవి పూజ,

10-09-28 - సర్వ ఏకాదశి,

13-09-28 - మాస శివరాత్రి,

14-09-28 - ఉత్తర కార్తె ప్రారంభం, పోలాల అమావాస్య, రుద్ర సావర్డిక మన్వాది, 15-09-23 - శైవ మౌనవ్రతం

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికంగా ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పిలుస్తారు.

మంగళగౌరీ వ్రతం: శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో మంగళ గౌరీ వ్రతం ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం: మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణ మాసంలో వచ్చే పండగలు: శుక్ల చవితి - నాగులచవితి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి - పుత్రదా ఏకాదశి: ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ: సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు. నుదుట బొట్టు పెట్టి, అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ - హయగ్రీవ జయంతి: వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం. హయగ్రీవ జయంతి అయిన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణ విదియ-శ్రీరాఘవేంద్రస్వామి జయంతి: క్రీ.శ. 1671వ సంవత్సరంలో విరోధికృత్‌ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ నాడు శ్రీరాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి: శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన కృష్ణపరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్నలను సమర్చించడం ఆచారం.

కృష్ణపక్ష అమావాస్య - పొలాల అమావాస్య: ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్చు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయని చిలకమర్తి తెలిపారు.

శ్రావణంలో శనివారం ప్రత్యేకత: ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి, ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం, పూజ, ఉపవాసం తదితర ఆచారాలు మనదగ్గర ఏర్పడ్డాయి. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయినా, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

ముఖ్యంగా కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం. శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్చించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చని చిలకమర్తి తెలిపారు.

చాలామంది తెలుగు ప్రజలు సంతానం లేని వారు సంతానం కోసం ఏడుకొండల వాడికి మొక్కుకునే ఆచారం ఉంది. తమ కోరిక తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణమాసంలో గోవిందం అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర/చెంబు పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్లి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామికి తియ్యని ప్రసాదం చేసి అందరికీ పంచడం, తామూ స్వీకరించడం ఆచారంగా వస్తుంది.

ఇలా మూడు లేదా ఐదు ఏండ్లు పాటిస్తారు. ఇలా ఆయా ప్రాంతాలలో అనేక ఆచారాలు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.