Dharmam: ధర్మం అంటే ఏమిటి? ధర్మబద్ధంగా జీవించడం ఎలా?
Dharmam: ధర్మబద్ధంగా జీవించడం వల్ల జ్ఞానవంతులు అవుతారు. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే అది మనల్ని రక్షిస్తుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
“ధృ" అనే ధాతువు నుండి “ధర్మం” అనే పదం పుట్టింది. “ధృ” అంటే ధరించడం అని అర్థం. దానంతట అది సహజంగా ధరింపబడిందే ధర్మం. అంటే అది అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని మతాలకు కూడ సహజంగా ఉంటుంది. ఒక మతం వారు గాని ఒక దేశం వారు గాని ఏర్పరచింది కాదు ధర్మం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దానంతట అది సహజంగా ఎప్పుడో ఒకప్పుడు ధరించేది అయినా జ్ఞానులు జ్ఞానదృష్టితో చూచి అందరి క్షేమం ఆలోచించి, సంఘం సుఖ జీవనాన్ని గురించి, అన్ని దేశాలవారు అన్ని మతాలవారు అన్ని కాలాలవారు ఎవరికి వారు వేరుగా చెప్పినా ఆ ధర్మాలు అన్నీ ఒకే రకంగా ఉండడం చూస్తే భగవచ్చక్తి చేతనే ఈ ధర్మాలు ఏర్పరచబడ్డాయా అని అనిపిస్తాయి. భగవచ్చక్తి అన్ని దేశాలవారికి అన్ని మతాలవారికి అన్ని కాలాలవారికి ఒక్కటే కాబట్టి అందరినీ తరింపజేయడానికి అవి అందరకూ సరిపడి ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.
హిందువులు తమ ధర్మాలు వేదాల్లో ఉన్నాయని అంటారు. మహమ్మదీయులు ఖురాన్లో ఉన్నాయని చెప్తారు. క్రైస్తవులు బైబిల్లో ఉన్నాయని అంటారు. అయా మతాలవారు తమ మతంలోని దేవునికి తలొక పేరు పెట్టుకున్నా తమ మత గ్రంథాలకు తలకొక పేరు పెట్టబడి ఉన్నా అందులోని మూల ధర్మ విషయాలు అందరకూ ఒకే విధంగా సరిపడి ఉన్నట్లు కన్పించడం విశేషం. ఈ ధర్మ మార్గం తరించడానికై సర్వులకు సర్వదా శిరోధార్యం.
“ధర్మో రక్షతి రక్షితః అని ఉంది. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అని అర్థం. కాన ధర్మరక్షణం స్వరక్షణమే అవుతుందని చిలకమర్తి తెలిపారు. ద్వేషంతో ద్వేషాన్ని శాంతించడం అనేది జరగనే జరగదు. ద్వేషాన్ని అనురాగం చేతనే శాంతింపజెయ్యాల్సి ఉంది. మన జీవితాలు నిత్యాలు కావు. శాంతిగా జీవించడం నేర్చుకోవాలి. నీలోని ద్వేషాగ్నిని ప్రేమామృతం చేత తడిపి చల్లారుస్తూ ఉండాలి.
చిత్తశుద్ధి అనేది ముక్తికి మూలాధారం. చిత్తశుద్ధికి శీలం మూలం. చిత్తశుద్ధి లేక శీలం సరిలేక కాషాయం కట్టినా, ఒరిగేదేమీ లేదు. వేషాలతో జరిగేదేమీలేదు. శాశ్వతమైనదేదో, అశాశ్వతమైనదేదో చక్కగా తెలిసి, శాశ్వతమార్గాన ప్రయాణం చెయ్యాలి. అప్పుడే సత్మార్యాచరణం నీకు అలవడుతుంది. అప్పుడు నీకు ఎల్లప్పుడూ ఆత్మానందంతో జీవయాత్ర నడుస్తుంది. ఇహ పర సుఖాల్నిస్తుంది. పాపకార్యాలు పైపైకి మెరుస్తూ సుఖాలు ఇస్తాయని అనిపిస్తుంది కానీ అదంతా మాయ. ఆ మాయలో పడరాదని చిలకమర్తి సూచించారు.
ధర్మాలు తలక్రిందుగా చదివి అప్పజెప్పడంవల్ల లాభం ఏమీలేదు. నీ ధర్మమేదో తెలిసికొని ఆచరించడం వల్లనే నీకు లాభం చేకూరుతుంది. అది తెలిసి అప్పజెప్పడం కోసం శాస్త్రాన్ని కింద నుంచి పైకి, పై నుంచి క్రిందకు చదవడం ఎందుకు? నీకు తెలిసిన ఒక్క ధర్మాన్నైనా సరే ఆచరణలో పెట్టడం నీకు అవసరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.