Jagannath rathayatra: భక్తుడి కోసం కొద్ది సేపు ఆగనున్న జగన్నాథ రథం.. ఎవరు అతను?
Jagannath rathayatra: ఒక భక్తుడి కోసం జగన్నాథ ఆలయం కొద్ది సేపు ఆగుతుంది. ఎవరు ఎంత లాగడానికి ప్రయత్నించినా కూడా అసలు కదలదు. ఇంతకీ ఎవరా భక్తుడు? ఏంటా కథ? ఇక్కడ తెలుసుకోండి.
Jagannath rathayatra: అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న పూరి జగన్నాథ్ కి రథయాత్ర కొనసాగుతోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఏ వార్షిక రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.
గర్భగుడిలో ఉన్న విగ్రహాలను రథాలపై ఉంచి గుండిచా ఆలయం వరకు ఊరేగింపుగా ఈ యాత్ర సాగుతోంది. తన అత్తగారి ఇంట్లో విడిది చేసి మళ్ళీ పూరీ జగన్నాథ ఆలయానికి తిరుగు యాత్ర జరుగుతుంది. దీన్ని బహుదా యాత్ర అంటారు. సాధారణంగా భగవంతుడి దర్శనం కోసం భక్తులు ఆరాటంగా వస్తారు. కానీ ఈ రథయాత్ర సమయంలో మాత్రం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఇక్కడ జగన్నాథుడే స్వయంగా తన భక్తుడికి దర్శనం ఇవ్వడం కోసం వెళ్తాడట.
పూరీ ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమైన తర్వాత 200 మీటర్ల దూరం వెళ్ళాక రథం కొద్దిసేపు ఆగుతుంది. అక్కడ ఎంతమంది ప్రయత్నించినా కూడా రథం మాత్రం ముందుకు కదలదు. ఆ ప్రదేశం పేరే మజార్. ఇది జగన్నాథుడి ముస్లిం భక్తుడైన సాల్బేగ్ సమాధి. ఇక్కడ జగన్నాథుడి రథం ఆగడం మొఘలుల కాలం నుంచి సాగుతోంది.
ఎవరు ఈ సాల్బేగ్ ?
మొగల్ సుబేదార్ కుమారుడు లాల్ బేగ్. అతను ఒక హిందూ యువతని వివాహమాడతాడు. వారిద్దరికీ పుట్టిన సంతానమే సాల్బేగ్. అతని తల్లి జగన్నాథుడికి పరమ భక్తురాలు. ఒకనాడు సాల్బేగ్ అనారోగ్యానికి గురైన సమయంలో అతడి తల్లి జగన్నాథుడిని ఆరాధించడం వల్ల కోలుకుంటాడు అప్పటి నుంచి సాల్బేగ్ తల్లి మాదిరిగా జగన్నాథుడికి భక్తుడిగా మారిపోయాడు.
అయితే పూరీలోనే జగన్నాథ ఆలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవాలని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అతడు జగన్నాథ ఆలయానికి సమీపంలోనే ఒక గుడిసె ఏర్పాటు చేసుకొని రథయాత్రలో స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నాడు.
తను చనిపోయేలాగా ఒక్కసారైనా జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని మనసులోనే కోరుకున్నాడు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే అతడు మరణించాడు. అతడి కోరిక మేరకు ఆ ఇంట్లోనే సమాధి చేశారు. దాని పేరే మజార్. అతడి కోరిక భగవంతుడి హృదయానికి చేరింది. రథయాత్ర ప్రారంభమైన తర్వాత జగన్నాథుడి రథం మజార్ దగ్గరికి రాగానే కొద్దిసేపు ఆగుతుంది. అప్పుడు జగన్నాథుడు స్వయంగా తన భక్తుడి దగ్గరికి వెళ్లి దర్శనం ఇచ్చాడని చెబుతారు. అందుకే రథం ఎంత కదిలించినా కూడా అక్కడ కదలకుండా కొద్దిసేపు ఆగుతుంది. ఈ సంప్రదాయం మొఘలుల కాలం నుంచి ఇప్పటికే ఆచరిస్తున్నారు.
పవిత్రమైన హృదయంతో దేవుడిని ఆరాధిస్తే ఎన్నటికైనా ఆ కోరిక భగవంతుడిని చేరుకుంటుందని నమ్మికకు ఇది ఒక సాక్ష్యంగా చెబుతారు. ఆ భక్తుడి పవిత్రమైన కోరిక భగవంతుడి హృదయాన్ని చేరిందని అందుకే స్వయంగా భగవంతుడే తన కోసం దిగి వచ్చాడని అందుకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా చెబుతారు. సాల్బేగ్ రచించిన భక్తి పాట “అహే నీలా శైలా..” అనే భక్తి పాట ఎప్పటికీ జగన్నాథ ఆలయంలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన రాసిన ఎన్నో భక్తి గీతాలు గర్భగుడిలో ఉదయం ప్రార్థన వేళ వినిపిస్తూనే ఉంటాయి.