Lord hanuman: రామాయణం రాసిన హనుమంతుడు.. కానీ అది ఏమైంది? ఎందుకు వెలుగులోకి రాలేదో తెలుసా?-hanuman also created his version of ramayanam but where is it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Hanuman: రామాయణం రాసిన హనుమంతుడు.. కానీ అది ఏమైంది? ఎందుకు వెలుగులోకి రాలేదో తెలుసా?

Lord hanuman: రామాయణం రాసిన హనుమంతుడు.. కానీ అది ఏమైంది? ఎందుకు వెలుగులోకి రాలేదో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Apr 22, 2024 02:14 PM IST

Lord hanuman: రామాయణం ఎవరు రాశారు అంటే వాల్మీకి మహర్షి అని చెప్తారు. అయితే శ్రీరాముడి పరమ భక్తులు హనుమంతుడు కూడా రామాయణం రాశాడట. కానీ అది వెలుగులోకి రాలేదు. ఎందుకో తెలుసా?

రామాయణం రాసిన హనుమంతుడు
రామాయణం రాసిన హనుమంతుడు (pinterest)

Lord hanuman: రామాయణం ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే అద్భుతమైన కావ్యం. భారతీయ ఇతిహాసాలలో ఆది కావ్యంగా చెబుతారు. రామాయణాన్ని ఎవరు రచించారు అనగానే తడుముకోకుండా ఠక్కున వాల్మీకి మహర్షి అని పేరు చెప్పేస్తారు.

రామాయణం అన్ని భాషల్లోను, అన్ని ప్రాంతాలలోను ఎంతో ఆదరణీయమైన, పూజనీయమైన కావ్యం. ఇతర దేశాల్లోనూ రామాయణం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇండోనేషియాలోని బాలిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధి చెందినది. వాల్మీకి రచించిన రామాయణంలో సీతారాముల గురించి చక్కగా వర్ణించారు. కొడుకుగా, భర్తగా, రాజుగా, సాధారణ మానవుడిగా శ్రీరాముడు ప్రవర్తించిన విధివిధానాల గురించి రామాయణంలో చక్కగా చెప్పారు.

రామాయణం రాసిన హనుమంతుడు

రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే కాదు శ్రీరాముడి పరమ భక్తుడైన ఆంజనేయుడు కూడా రచించాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం గెలిచిన తర్వాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్లి తన గోళ్ళతో రామాయణం రాయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుడిని దాని గురించి అడిగాడు.

హనుమంతుడు వెంటనే వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకొని అతను రాసిన రామాయణాన్ని చూపించి ఎలా ఉందో చెప్పమని మహర్షి అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు వాల్మీకి కళ్ళనిండా నీళ్లతో అద్భుతంగా ఉంది. చాలా పరిపూర్ణమైనదని అన్నాడు. అలాగే ఇక “నా రామాయణం గురించి ఎవరు పట్టించుకుంటారని” అన్నాడట. ఇది విన్న హనుమంతుడు మరో ఆలోచన లేకుండా తన రాసిన రామాయణాన్ని నాశనం చేశాడు. అలా హనుమంతుడు రాసిన రామాయణం వెలుగులోకి రాకుండానే నాశనం అయిపోయింది.

హనుమంతుడు కలియుగంలోనూ ఉన్నాడా?

హనుమంతుడు చిరంజీవిగా వరం పొందిన వాడు. అందుకే ఆయనకు మరణం అనేది లేదని అంటారు. కలియుగంలోనూ హనుమంతుడు జీవించే ఉన్నాడని చాలామంది నమ్ముతారు. శ్రీరాముడు తన శాశ్వత నివాసమైన వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు తన భక్తులందరినీ తనతో రమ్మని కోరాడట. అయితే హనుమంతుడు మాత్రం వచ్చేందుకు నిరాకరించాడు. రామా అనే పవిత్ర నామం జపించడం స్వర్గం కంటే కూడా మధురంగా ఉంటుందని హనుమంతుడు అన్నాడు. తన భగవంతుని నామాన్ని జపించే ఒక్క వ్యక్తి ఉన్నంతవరకు తాను భూమిపై ఉంటానని వారిని అన్ని బాధల నుంచి రక్షిస్తానని రాముడికి వాగ్దానం చేశాడు. అందుకే కలియుగంలోనూ హనుమంతుడు బతికే ఉన్నాడని చాలామంది నమ్ముతారు.

ఒంటి నిండా సింధూరం అందుకే..

ఆంజనేయుడి శరీరం ఎప్పుడు కాషాయం రంగులోనే కనిపిస్తుంది. మనకు కనిపించే విగ్రహాలు అన్నీ ఎక్కువగా ఈ రంగులోనే ఉంటాయి. హనుమంతుడి జెండాలు కూడా ఇదే రంగు. అయితే ఈ రంగు హనుమంతుడికి ఎందుకు అంత ప్రాధాన్యమో తెలుసా? శ్రీరాముడి కోసం అలా ఒంటి నిండా రంగు పులుముకున్నాడు.

ఒకనాడు సీతమ్మ తల్లి తన నుదుటిన సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు చూస్తాడు. అలా ఎందుకు చేస్తున్నారని అడగ్గా శ్రీరాముడి రక్ష కోసం తాను ఇలా పెట్టుకుంటున్నట్టు చెప్పిందట. వెంటనే హనుమంతుడు వెళ్ళి తన శరీరం మొత్తం సింధూరం పులుముకుని వచ్చేశాడు. రాముడి మీద ఉన్న అమితమైన భక్తికి ఇదొక నిదర్శనం.

యముడిని అడ్డుకున్న హనుమంతుడు

పుట్టిన వాడు మరణించక తప్పదని అంటారు. అది శ్రీరాముడి జీవితంలోను జరిగింది. అయితే రాముడు తన జీవితాన్ని చాలించేందుకు బయలుదేరే సమయం ఆసన్నమైంది. అప్పుడు యమధర్మ రాజు శ్రీరాముడి కోసం అయోధ్యలో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. కానీ హనుమంతుడు యముడిని అయోధ్యలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. దీంతో యముడిని అనుమతించేందుకు రాముడు హనుమంతుడిని మోసగించాల్సి వచ్చింది.

WhatsApp channel