Sri rama navami 2024: శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా? రామచంద్రుడు పేరు ఎలా వచ్చిందంటే
Sri rama navami 2024: చైత్ర శుక్ల నవమి రోజు శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. దశరథ మహారాజు పెద్ద కుమారుడిగా జన్మించాడు. శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా? రఘు వంశ గురువు వశిష్టుడు ఈ పేరు పెట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి.
Sri rama navami 2024: తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి అరణ్యవాసానికి వెళ్లిన వ్యక్తి శ్రీరాముడు. విధేయుడైన కొడుకుగా మాత్రమే కాకుండా ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎలా ఉండాలో స్వయంగా చూపించాడు.
వాల్మీకి రచించిన రామాయణంలో శ్రీరాముడు వనవాసం, తర్వాత అనుభవించిన పోరాటాల గురించి వివరంగా ఉంటుంది. మంచి కొడుకుగా మాత్రమే కాకుండా మంచి సోదరుడిగా, నీతి నిజాయితీ కలిగిన రాజుగా, ఏకపత్నీ వ్రతుడిగా అనేక విధాలుగా పరిపూర్ణుడుగా జీవనం సాగించాడు. తాను ఎప్పుడు దేవుడిని అనే భావన లేకుండా సాధారణ మనిషిగానే ప్రజల కష్టాలను అనుభవించాడు. రామరాజ్యాన్ని స్థాపించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. అందుకే శ్రీరాముడిని మర్యాదరాముడు, పురుషోత్త రాముడు అంటారు.
హిందూమతంలో శ్రీరాముడుని ఆదర్శవంతమైన మానవ జీవితానికి చిహ్నంగా పూజిస్తారు. రాముడి కథ గురించి అందరికీ తెలిసినప్పటికీ ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు? అనే దాని గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారు? దీని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం.
శ్రీరాముడికి పేరు ఎవరు పెట్టారంటే?
రఘుకుల గురువైన మహర్షి వశిష్టుడు దశరథ మహా రాజు పెద్ద కుమారుడికి శ్రీరాముడు అని పేరు పెట్టారు. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు జన్మించిన తర్వాత అతనికి దశరథ రాఘవ అని పేరు పెట్టారు.
“ఓం నమో నారాయణాయ నమః” అనే మంత్రం నుంచి “రా” అనే అక్షరాన్ని “ఓం నమః శివాయ” నుంచి “మ” అనే అక్షరాన్ని ఎంచుకొని ఆ రెండింటినీ కలిపి రామ అనే పేరుని పెట్టారు. రామ అనే రెండు అక్షరాలు అత్యంత శక్తివంతమైన తారక మంత్రం. గురువు వశిష్ట చెప్పిన దాని ప్రకారం రామ అనే పదం రెండు బీజాంశాలతో రూపొందించబడింది. అగ్ని బీజమ్, అమృత బీజమ్ రెండింటినీ కలిపితే వచ్చే పదమే ఈ రామ.
రామ అనే రెండు అక్షరాలు నిత్యం పఠించడం వల్ల ఆత్మ, మనసుకు బలాన్ని ఇస్తుంది. శ్రీరాముడికి మాత్రమే కాకుండా అతని సోదరులైన భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడికి కూడా వశిష్టుడే పేరు పెట్టాడు.
బాలరాముడిని చూసేందుకు దేవుళ్ళతో సహా అందరూ మనుషులు వేషంలో వచ్చారని చెబుతారు. దేవతలు ఒక్కొక్కరుగా ఉయ్యాల దగ్గరకు వచ్చి ఎవరికీ తెలియకుండా మౌనంగా స్వామి వారికి నమస్కారాలు చేశారు. సూర్యదేవుడి వంతు వచ్చినప్పుడు సూర్యవంశంలో జన్మించినందుకు శ్రీరాముడికి భక్తిపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. సూర్యుడి కృతజ్ఞతలను బాలుడి రూపంలో ఉన్న భగవంతుడు చిరునవ్వుతో అంగీకరించాడు.
రామచంద్రుడు అనే పేరు ఎలా వచ్చింది
ఒక్కొక్కరిగా శ్రీరాముడిని దర్శించుకుంటూ ఉండగా చంద్రుడి వంతు వచ్చింది. అయితే అతని ముఖంలో చాలా విచారం కనిపించింది. భగవంతుడు అతనితో ఏమైంది ఎందుకు విచారంగా కనిపించావని అడిగాడు. అప్పుడు తనని నిర్లక్ష్యం చేశారని సూర్యభగవానుడికి అంతటి ప్రాధాన్యత ఇచ్చి తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అందుకే కలత చెందినట్లు చంద్ర భగవానుడు చెప్తాడు.
చంద్రుడి బాధను అర్థం చేసుకున్న భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో చంద్రవంశంలో తాను జన్మిస్తానని చెప్తాడు. అయితే త్రేతాయుగం ముగిసి ద్వాపరయోగం ప్రారంభం అవ్వడానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఉందని చంద్రుడు బాధపడతాడు. దీంతో భగవంతుడు చిరునవ్వు నవ్వి సరే ఈరోజు నుంచి నా పేరు రామాకి తోడు చంద్ర అని కూడా చేర్చుకుంటాను. ప్రజలు నన్ను రామచంద్ర అని సంబోధిస్తారని చెప్తాడు. ఈ మాట చెప్పగానే చంద్రుడు చాలా సంతోషిస్తాడు. అలా శ్రీరాముడిని రామచంద్రుడు అని కూడా పిలుస్తారు.
శ్రీరాముడికి ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థానం ఉంటుంది. అందుకే ఆయన్ను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినందుకు గాను రాముడు ఎవరిమీద ఎటువంటి కోపం చూపించలేదు. గౌరవం, దయ, సత్యం, కరుణ, సహేతుకతతో ప్రవర్తించాడు. ఇన్ని సద్గుణాలు ఉండటం వల్ల శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు.