Ayodhya sri rama navami celebrations: అయోధ్య రామయ్య తొలి శ్రీరామనవమి వేడుకలు.. ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?-ayodhya ram lalla first sri ram navami celebrations do you know these special features ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayodhya Sri Rama Navami Celebrations: అయోధ్య రామయ్య తొలి శ్రీరామనవమి వేడుకలు.. ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?

Ayodhya sri rama navami celebrations: అయోధ్య రామయ్య తొలి శ్రీరామనవమి వేడుకలు.. ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?

Gunti Soundarya HT Telugu
Apr 16, 2024 03:40 PM IST

Ayodhya sri rama navami celebrations: శ్రీరాముడి జన్మ స్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత అయోధ్యలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.

అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా
అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా (x)

Ayodhya sri rama navami celebrations: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి తొలి శ్రీరామనవమి వేడుకలు ఏప్రిల్ 17 వ తేదీ జరగనున్నాయి. ఇప్పటికే అయోధ్య రామ మందిరం మొత్తం సర్వాంగ సుందరంగా అలంకరించారు.

yearly horoscope entry point

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకోవచ్చు.

సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. 20వ తేదీ నుంచి వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి.

శ్రీరామనవమి రోజు దర్శన సమయం

ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది.

ఉదయం 3.30గంటలకు మంగళ హారతి ఇస్తారు. అప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు శ్రీరాముడిని దర్శించుకోవచ్చు. దర్శన సమయంలో అసౌకర్యం, సమయం వృధా కాకుండా ఉండేందుకు భక్తులు తమ మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులను తీసుకురావద్దని సూచించారు.

బాల రాముడికి సూర్యుడి తిలకం

ఈ ఏడాది శ్రీరామనవమి రోజు అయోధ్యలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం పడే విధంగా ఏర్పాటు చేశారు.

మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు శ్రీరాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. శ్రీరాముడికి అలంకరించే సూర్య తిలకం వేడుకను ఇంట్లో ఉండి కూడా తిలకించే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. దూరదర్శన్ లో సూర్య తిలకం వేడుక ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

అయోధ్య నగరం అంతటా దాదాపు వంద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి. అందువల్ల ఇంటి దగ్గర నుంచే భక్తులు అయోధ్య శ్రీరామనవమి వేడుకలు తిలకించవచ్చు.

వీఐపీ దర్శనాలకు బ్రేక్

శ్రీరామనవమి రోజు లక్షలాది మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉన్నందున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వీఐపీ దర్శనాలను నిలిపివేసింది. 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఇచ్చే పాసులను రద్దు చేసింది. తిరిగి 19 నుంచి అతిథులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది.

లక్ష కేజీల లడ్డూలు

శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించనున్నారు. దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా ఇప్పటికే ప్రకటించారు.

అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40,000 కేజీల లడ్డూలు ఇచ్చింది.ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఈ లడ్డూలను ఇస్తున్నట్లు వెల్లడించారు. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 

Whats_app_banner