Mahalaya Paksha 2023 : మహాలయ పక్షాల్లో సూర్యగ్రహణం మంచిదా?
07 October 2023, 15:59 IST
- Mahalaya Paksha 2023 : ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14న రానుంది. అయితే మహాలయ పక్షంలో సూర్య గ్రహణం రావడం మంచిదేనా? కాదా? అనే విషయంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరాలు వెల్లడించారు.
సూర్య గ్రహణం
14 అక్టోబర్ 2023 భాద్రపద మాస కృష్ణ పక్ష అమావాస్య ఈ మహాలయ పక్షంలో ఆఖరి రోజు. మహాలయ అమావాస్య రోజన చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా భాద్రపద మాస అమావాస్య చిత్తా నక్షత్రంలో సూర్య గ్రహణం వస్తుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటల 34 నిమిషాలకు॥ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభం అవుతుంది. ఇది అర్ధరాత్రి 2 గంటల 28 నిమిషాలకు ముగుస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
లేటెస్ట్ ఫోటోలు
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించదని అందువల్ల భారతదేశంలో గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదని చిలకమర్తి తెలిపారు. మహాలయపక్షాలలో గ్రహణం రావడం దోషమేమి కాదని, ప్రతీ సంవత్సరంలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తాయని చిలకమర్తి వెల్లడించారు. గ్రహణ సమయంలో చేసేటటువంటి పితృ తర్పణాలకు కూడా విశేషమైన ఫలితాలుంటాయని తెలిపారు.
మహాలయ పక్షాలలో ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం కారణంగా దీనికి సంబంధించినటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు.
ఈ సూర్యగ్రహణం సంభవించేటటువంటి ఉత్తర దక్షిణ అమెరికా, కొలంబియా, పసిఫిక్ మహాసముద్రం ఉన్నటువంటి ప్రాంతంవారు గ్రహణ నియమాలు ఆచరించుకోవచ్చని చిలకమర్తి తెలిపారు. భారతదేశంలోని వారందరూ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించని కారణంతో మహాలయ పక్షాలు, పితృ పక్షాలకు సంబంధించిన, మహాలయ అమావాస్యకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రమే యథావిధిగా కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. మహాలయ అమావాస్య రోజు భారతదేశంలో ఎలాంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదని చిలకమర్తి స్పష్టంగా చెప్పారు.