Narmada pushkaralu: పుష్కర విధులు ఎన్ని? వాటి ప్రాముఖ్యత ఏంటి? పుష్కర దానం వల్ల కలిగే ప్రయోజనాలు
02 May 2024, 18:10 IST
- పుష్కరాలు అంటే ఏంటి? పుష్కర విధులు ఎన్ని? వాటి ప్రాముఖ్యత ఏంటి? పుష్కర దానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
పుణ్య స్నానం ఆచరిస్తున్న భక్తులు( Representational image)
Narmada pushkaralu: పుష, పుష్టో అనే ధాతువు నుండి ఏర్పడిన శబ్దము పుష్కరము. పుష్కరం అంటే పోషించేటటువంటిదని ఒక అర్థం. మానవుడు తాను తెలిసికాని తెలియక కాని తమ ప్రారబ్ధంగా వచ్చిన పాప కర్మలను నశింపచేసుకోవడానికి ఈ జన్మలో పుణ్యాన్ని సంపాదించుకోవడానికి పుష్కరాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అటువంటి పుష్కరాలలో ఆచరించవలసినటువంటి విధులు పుష్కర స్నానం, పుష్కర దానం, జపం, తపం, హోమం, శ్రాద్ధకర్మలు.
పుష్కర స్నానం
పుష్కర స్నానాన్ని ఓ పవిత్రకార్యంగా భావించాలే కానీ మురికిని వదిలించుకునే అభ్యంగనంగా కాదు. అందుకే శుభ్రమైన దుస్తులతో , సంకల్పం చెప్పుకొని మూడు మునకలు వేయాలి. నదిలో నలుగురూ స్నానం చేస్తున్న చోట బట్టలుతుకుతూ, సబ్బు రాసుకుంటూ ఉంటే అది పుష్కర స్నానం అనిపించుకోదు. స్నానం ఆచరిస్తున్న సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి.
జీవకోటి దాహార్తిని తీరుస్తున్న నదీమ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్నానం పూర్తయిన తర్వాత నర్శదాదేవికి, త్రిమూర్తులకు, బృహస్పతికి, పుష్కరుడికి, సప్తరుషులకు, అరుంధతికి అర్ఘ్యం అందించడం విధి. పితృదేవతలకు కూడా నీరు వదిలి బయటికి వచ్చిన తర్వాత విభూది, కుంకుమలు అద్దుకోవాలి. అపై తీరం సమీపంలో ఉన్న ఆలయానికి చేరుకుని దైవదర్శనం చేసుకోవాలని చిలకమర్తి తెలిపారు.
పుష్కర దానం
పుష్కరాలు జరిగే 12 రోజులలో రోజుకో తరహా దానం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. ఉదాహరణకు తొలి రోజు బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేస్తే మహారాజ యోగం దక్కుతుంది. రెండో రోజు వస్త్రాలు, గోవులు, ఉప్పు, రత్నాలు దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందనీ ఇలా రోజుకొక దానాన్నీ దాని వల్ల కలిగే ఫలితాలనూ సూచించారు. సాయం చేయాలనీ, సంపదను సాటివారితో పంచుకోవాలనీ సూచించే సంప్రదాయానికి ప్రతిరూపంగా ఈ విధులను భావించవచ్చునని చిలకమర్తి తెలిపారు.
శ్రాద్ధకర్మలు
పెద్దలను తలుచుకునేందుకు, వారి పట్ల కృతజ్ఞత చాటేందుకు, వారి ఆశీస్సులు తీసుకునేందుకు పుష్కరాలు ఓ మంచి సందర్భం. పుష్కర సమయంలో గతించిన పెద్దలకు శ్రాద్ధకర్మలు చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వంశం వృద్ధి చెందుతుందని నమ్మకం. పిండ ప్రదానం చేయ లేనివారు నువ్వులు, నీళ్లతో తర్పణాలు విడిస్తే సరిపోతుందని పెద్దల మాట.
మాతాపితరులు మరణించిన తిథి రోజున శ్రాద్ధకర్మ చేస్తే మరీ మంచిది. కేవలం గతించిన మన పెద్దలకే కాదు... సమీప బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు కూడా పిండ ప్రదానం చేయవచ్చును. అంతేకాదు పుష్కరుడితోపాటు సకల దేవతలు కొలువుండే ఈ సమయంలో ఆ నీటిని కొంత ఇంటికి తెచ్చుకుని వాటిని సంప్రోక్షణ కోసం వాడుకోవడం అనవాయితీ. పుష్కరాలు జరిగే నదీ తీరాన భజనలు, కీర్తనలతో భక్తులు నదీమ తల్లిని కొలుచుకోవడమూ, నదికి వాయినాలు సమర్చించుకునే ఆచారమూ కొన్ని ప్రాంతాల్లో ఉంటుందని చిలకమర్తి తెలిపారు.
జపం, తపం
పుష్కర నది ప్రవాహ ప్రాంతంలో జపతపాలు ఆచరించేటటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. పుష్కరాలు జరిగేటటువంటి నదీ పరివాహక ప్రాంతంలో పంచాక్షరీ, అష్టాక్షరీ వంటి మంత్రాలను జపించడం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయటం వలన విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.