Narmada pushkaralu 2024: నేటి నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం.. ఈ సమయంలో ఏ వస్తువులు దానం చేయాలంటే
Narmada pushkaralu 2024: నేటి నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానం ఆచరించేందుకు ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈ పన్నెండు రోజులు ఏయే వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Narmada pushkaralu 2024: దేవ గురువు బృహస్పతి మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో నేటి నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలోని పన్నెండు పవిత్ర నదులలో ఒకటైన నర్మదా నదిని పూజించేందుకు, శుద్ధి చేసేందుకు అంకితం చేసే పుష్కరాలు ఇవి.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు జరుపుకుంటారు. నర్మదా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వసిస్తారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్ నర్మదా నది ప్రవహిస్తున్న ప్రదేశాలలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల కోసం అనేక స్నాన ఘాట్లు ఏర్పాటు చేస్తారు.
నర్మదా నదికి హిందూ మతంలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. శివుని సన్నిధి ద్వారా పవిత్రం చేసిన నదిగా భావిస్తారు. భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసేందుకు పవిత్ర జలాలలో పవిత్ర స్నానాలు చేస్తారు. నర్మదా నది పుష్కరాలు మే 1న ప్రారంభమై మే 12 వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. ఈ 12 రోజుల కాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు, భక్తులు నర్మదా నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తారు. పూజలు, పిండ ప్రదానాలు, నైవేద్యాలు సమర్పిస్తారు.
నర్మదా నది పుష్కరాల సందర్భంగా భక్తులు వివిధ దానధర్మాలు చేసి దైవ అనుగ్రహం కోసం కానుకలు సమర్పిస్తారు. పన్నెండు రోజుల పాటు ఎటువంటి వస్తువులు దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందో తెలుసుకుందాం.
ఏ రోజు ఏ దానం
నర్మదా నది పుష్కరాలు జరిగే మొదటి రోజు బంగారం, వెండి, ధాన్యాలు వంటి వస్తువులు దానం చేయాలి.
రెండవ రోజు దుస్తులు, ఉప్పు, రత్నాలు వంటివి దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది.
మూడవ రోజు బెల్లం, గుర్రానికి సంబంధించిన వస్తువులు, పండ్లు దానం చేయాలి.
నాలుగో రోజు నెయ్యి, పాలు, నూనె, తేనే వంటి ద్రవ పదార్థాలు దానం చేస్తే మంచిది.
ఐదో రోజు గింజలు, ఎద్దులు, నాగలి వంటి వ్యవసాయ సంబంధిత వస్తువులు దానం చేయాలి.
ఆరో రోజు ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి వంటివి దానం చేస్తే మంచిది.
ఏడవ రోజు గృహోపకరణాలు, పరుపులు వంటి శయన వస్తువులు దానం చేస్తే మంచిది.
ఎనిమిదో రోజు చందనం, కూరగాయలు, పూలు వంటివి దానం చేయాలి.
తొమ్మిదో రోజు దుప్పట్లు, ధాన్యం వంటి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది.
పదో రోజు కూరగాయలు, సాలగ్రామ రాళ్ళు, పుస్తకాలు వంటివి దానం చేయాలి.
పదకొండవ రోజు ఏనుగుని దానం చేయాలి.
పన్నెండవ రోజు నువ్వులు దానం చేస్తే మంచిది.
వీటిని దానం చేయడం వల్ల కుటుంబాలకు ఆధ్యాత్మిక యోగ్యత, ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు.
నర్మదా పుష్కరాలకు సంబంధించిన ఆలయాలు
అమర్ కంటక్ ఆలయం
జ్యోతిర్లింగాలలో ఒకటి ఓంకారేశ్వర ఆలయం
చౌబిస్ యోగి ఆలయం: నర్మదా నది ఒడ్డున ధ్యానం చేసిన 24 యోగులకు అంకితం చేసిన ఆలయం ఇది.
చౌబిస్ అవతార ఆలయం: ఈ ఆలయంలో విష్ణువుకు సంబంధించిన 24 అవతారాలను సూచించే విగ్రహాలు ఉన్నాయి.
మహేశ్వర్ ఆలయం: నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర్ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి చెందినది.
నర్మదా సిద్దేశ్వరాలయం: శివుడికి అంకితం చేసే పవిత్ర క్షేత్రం ఇది. ఇక్కడ ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు.
భోజ్ పురి శివాలయం: చారిత్రాత్మకమైన శివాలయం ఇది. శివుడికి చెందిన ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
పుష్కర స్నానం అచ్చరించేందుకు ఘాట్లు
నర్మదా నది పుష్కరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఈ ఘాట్లలో భక్తులు ఏర్పాట్లు చేస్తారు.
కోటి తీర్థ ఘాట్
చక్ర తీర్థ ఘాట్
గౌముఖి ఘాట్
భైరన్ ఘాట్
కేవల్రామ్ ఘాట్
నగర్ ఘాట్
బ్రహ్మపురి ఘాట్
సంగం ఘాట్
అభయ్ ఘాట్