Sri Ramanavami Recipes: చిట్టి గారెలు, కొబ్బరి బూరెలు... శ్రీరామనవమికి నోరూరించే నైవేద్యాలు, రెసిపీలు ఇవిగో
Sri Ramanavami Recipes: శ్రీ రామ నవమికి నైవేద్యంగా చిట్టి గారెలను, కొబ్బరి బూరెలను సమర్పించండి. వీటిని చేయడం చాలా సులువు. రెసిపీలను ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.
Sri Ramanavami Recipes: శ్రీరామనవమి వచ్చిందంటే ప్రతి వీధిలోను శ్రీ రామ కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతాయి. నైవేద్యంగా పానకం, వడపప్పు, చలివిడితో పాటు మరికొన్నింటిని నివేదిస్తారు. మీరు శ్రీరామ నవమికి ఏ ప్రసాదాలను చేయాలనే ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ చిట్టి గారెలు, కొబ్బరి బూరెలు ప్రయత్నించి చూడండి. ఇవి చేయడం చాలా సులువు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
చిట్టి గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
మినప్పప్పు - ఒక కప్పు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - ఒక స్పూన్
కారం - ఒక స్పూన్
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
చిట్టి గారెలు రెసిపీ
1. మినప్పప్పుని శుభ్రంగా కడిగి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. ఆ తర్వాత మళ్లీ నీటితో శుభ్రం చేసి నీళ్లన్నీ వంపేయాలి.
3. దీన్ని మిక్సీ గిన్నెలో వేసి రుచికి సరిపడా ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. నీళ్లు ఎక్కువగా వేయకూడదు. కాస్త పిండి గట్టిగా ఉంటేనే గారెలు వేయడం సులువుగా అవుతుంది.
5. పిండి పలచన అయితే గారెలు సరిగా రావు.
6. మిక్సీలో రుబ్బుకున్న పిండిని మొత్తం ఒక గిన్నెలో వేయాలి.
7. ఆ గిన్నెలోనే జీలకర్ర, కరివేపాకులు, కొత్తిమీర తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు వంట సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనెను వేసుకోవాలి.
9. ఆ నూనె వేడెక్కే వరకు వేచి ఉండాలి.
10. నూనె వేడెక్కాక పిండిని వేళ్ళతో తీసుకొని చిన్న చిన్న గారెల్లా ఒత్తుకొని మధ్యలో రంధ్రం పెట్టి నూనెలో జారవిడుచుకోవాలి.
11. రెండు వైపులా ఎర్రగా కాలే వరకు ఉంచుకోవాలి.
12. అంతే చిట్టి గారెలు సిద్ధమైనట్టే. సాధారణ గారెలతో పోలిస్తే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. నైవేద్యంగా ఆ దేవునికి సమర్పించాక... పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
.............................
కొబ్బరి బూరెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
మినప్పప్పు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
బెల్లం తురుము - ఒక కప్పు
బియ్యప్పిండి - రెండు కప్పులు
పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
యాలకుల పొడి - అర స్పూను
జీడిపప్పు పలుకులు - గుప్పెడు
కొబ్బరి బూరెలు రెసిపీ
1. మినప్పప్పును ముందుగానే మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.
2. ఆ పొడిని జల్లించి ఒక గిన్నెలో వేయాలి.
3. ఆ గిన్నెలో అర స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి.
4. తగినన్ని నీళ్లు వేసి కలిపి ఒక గంటపాటూ వదిలేయాలి.
5. ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లాన్ని వేసి కరగబెట్టాలి.
6. బెల్లం కరిగాక అందులో కొబ్బరి తురుమును వేసి బాగా కలపాలి.
7. పావుగంట సేపు కలిపాక తరిగిన జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి.
8. ఇది దగ్గరగా హల్వాలాగా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయాలి.
9. అందులో రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.
10. ఈ బియ్యప్పిండి వేయడం వల్ల కొబ్బరి మిశ్రమం గట్టిగా మారుతుంది.
11. దాన్ని చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి.
12. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మినప పిండిలో అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసుకుని కాస్త పలుచగా చేసుకోవాలి.
13. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఈ కొబ్బరి లడ్డులను మినప్పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.
14. అన్ని వైపులా రంగు మారేవరకు వేయించుకోవాలి. ఇవి ఎర్రగా క్రిస్పీగా మారుతాయి.
15. వాటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇవి నైవేద్యాలుగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత తినేందుకు కూడా రుచిగా ఉంటాయి.
టాపిక్