గంగా దసరా పండగ.. ఆ రోజు ఏం చేయాలంటే
23 May 2023, 9:35 IST
- గంగా దసరా పండగ రోజు ఆచరించాల్సిన విధులు, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి.
హరిద్వార్‌లో భక్తుల పుణ్య స్నానాలు (ఫైల్ ఫోటో)
గంగా దసరా పండగకు హిందూ మతం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఏటా జ్యేష్ట మాసం శుక్ల పక్షం పదో రోజున వస్తుంది. అంటే ఈ ఏడాది మే 30న వస్తుంది. ఉత్తరాదిన గంగా దసరా పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజున గంగా మాత స్వర్గం నుంచి భూలోకానికి దిగింది.
లేటెస్ట్ ఫోటోలు
సగర చక్రవర్తి తన కుమారులకు సద్గతి ప్రాప్తి చెందాలని గంగా నీళ్లతో తర్పణం ఇవ్వాలనుకుంటాడు. కానీ గంగా మాత అనుగ్రహం పొందలేకపోతాడు. అంశుమంతుడు రాజయ్యాక ఆకాశం నుంచి గంగను తేలేకపోతాడు. తరువాత దిలీప మహారాజు కూడా తేలేకపోయాడు. భగీరథుడి రాజవుతాడు. పితృ దేవతలకు సద్గతి కోరుకున్నాడు. బ్రహ్మ గురించి తపస్పు చేస్తాడు. తన పితృదేవతలను ఉద్దరించేందుకు కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ దేవుడు దేవతలతో కలిసి ప్రత్యక్షమవుతాడు. నా పితృదేవతలు కపిల మహర్షి ఆగ్రహం చేత బూడిద కుప్పలయ్యారని, వారికి సద్గతి ప్రాప్తి కోరుకుంటున్నానని, గంగ ఆకాశం నుంచి దిగి వచ్చి, పాతాళ లోకంలో ఉన్న ఆ భస్మ రాశులపై ప్రవహించాలని కోరుకుంటున్నట్టు చెబుతాడు.
ఆకాశం నుంచి గంగ భూమి మీద పడితే భూమికి తట్టుకునే శక్తి లేదని, గంగను పట్టుకోగలిగిన వాడు పరమ శివుడొక్కడేనని బ్రహ్మదేవుడు చెబుతాడు. నీకు ఓపిక ఉంటే పరమ శివుడికి తపస్సు చేయమని సూచిస్తాడు. పరమేశ్వరుడి కోసం ఒక సంవత్సర కాలం భగీరథుడు కఠోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను నా నెత్తి మీద పట్టుకుంటానని చెబుతాడు.
పరమశివుడు సిద్ధంగా ఉండడంతో గంగ ఆకాశంలో నుంచి బయలుదేరుతుంది. నన్నే పట్టుకుంటానని శివుడు అహంకారంతో ఉన్నాడని గంగమ్మ భావిస్తుంది. మొసళ్లతో రావాలని భావిస్తుంది. శివుడిని ఈడ్చుకుపోవాలని భావిస్తుంది. ఇది గ్రహించిన శివుడు తన జఠాఝూటం విప్పుతాడు. గంగను అందులో బంధిస్తాడు. ఒక సంవత్సరం పాటు ఒక చుక్క నీరు కూడా బయటకు రాలేదు.
భగీరథుడు మళ్లీ తపస్సు మొదలుపెడతాడు. మా పితృదేవతలను ఉద్దరించేందుకు గంగను విడిచిపెట్టాలని ప్రార్థిస్తాడు. ఇక శివుడు మార్గం విడుస్తూ బిందు సరోవరంలో పడేలా చేస్తాడు. మొసళ్లు, ఎండ్రికాయలు, పాములు, చేపలు, సుడులు.. ఇలా గంగ బిందు సరోవరంలో పడుతుంది. అలా గంగావతరణం జరుగుతుంది. అందరూ పాప విముక్తులవుతారు.
అందువల్ల గంగా దసరా రోజున గంగా మాతను పూజించాలి. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని, మరణానంతరం మోక్షం లభిస్తుందని విశ్వాసం. గంగా దసరా పూజా విధానం, మంత్రం, శుభ ముహూర్తం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గంగా దసరా శుభముహూర్తం
దశమి తిథి ప్రారంభం: మే 29, 2023 ఉదయం 11.49 గంటలకు
దశమి తిథి సమాప్తం: మే 30, 2023 మధ్యాహ్నం 1.07 గంటలకు,
గంగా దసరా పూజా విధానం
గంగా దసరా రోజున ఉదయాన్నే నిద్ర లేచి గంగా స్నానం చేయాలి. లేదా సమీపంలోని నదీ స్నానానికి వెళ్లాలి. గంగా మాతకు హారతి ఇవ్వాలి. గంగా స్నానానికి వెళ్లలేని వారు ఇంట్లోనే ఉండి స్నానపు నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేయాలి. ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగించాలి. గంగా మాతను ధ్యానం చేయాలి. గంగా దసరా రోజు దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.