Seven horse painting: 7 గుర్రాల పెయింటింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నారా? ఏ రంగు గుర్రాలు వేటికి సంకేతం
06 February 2024, 13:23 IST
- Seven horse painting: ఎక్కువ మంది తెలుపు రంగు గుర్రాల పెయింటింగ్ ఇంట్లో పెట్టుకుంటారు. కానీ వాటిలో రంగులు బట్టి కూడా అదృష్టం ఉంటుందని మీకు తెలుసా? ఏ రంగు గుర్రాలు వేటికి ప్రతీకగా ఉంటాయో తెలుసా?
గుర్రాల పెయింటింగ్( Representational image)
Seven horse painting: ఇంటిని అందంగా ఉంచుకోవడం కోసం చాలా మంది గోడలకు అందమైన ప్రకృతి చిత్రాలు, పెయింటింగ్స్ తగిలించుకుంటున్నారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు వాటిని చూడగానే ఆకర్షితులు అవుతారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇళ్ళలో కనిపించే పెయింటింగ్ ఏడు తెల్లటి గుర్రాల చిత్రం.
ఏడు గుర్రాల పెయింటింగ్ ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. వాస్తు, ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం కూడా గుర్రాల చిత్రం ఇంట్లో ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు. అయితే ఈ ఏడు తెల్ల గుర్రాల చిత్రం సరైన దిశలో ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే అది శుభఫలితాలు ఇస్తుంది.
7 సంఖ్య ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
వాస్తు శాస్త్రంలో ఏడు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. పెళ్లిలో వేసే అడుగులు ఏడు, ఇంద్రధనుస్సులో రంగులు ఏడు, ఏడు మహా సముద్రాలు, సప్త రుషులు, సూర్యుడి రథానికి ఉండే గుర్రాలు ఏడు. ఇలా హిందూ మతంలో ఏడు సంఖ్య సానుకులమైనదిగా భావిస్తారు. అందుకే ఏడు గుర్రాల పెయింటింగ్ శుభాన్ని సూచిస్తుంది.
ఏడు గుర్రాల చిత్రం ఏ దిశలో పెట్టాలి?
ప్రతికూల శక్తులని నిరోధించడంలో ఏడు గుర్రాల పెయింటింగ్ సహాయపడుతుంది. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏడు గుర్రాల పెయింటింగ్ పెట్టేందుకు దక్షిణం ఉత్తమ దిశ. ఈ దిశ విజయం, కీర్తితో ముడిపడి ఉండటం వల్ల ఇక్కడ పెయింటింగ్ పెడితే మీరు అన్నింటా విజయం సాధిస్తారు. ఈ పెయింటింగ్ వేలాడదీసేటప్పుడు గుర్రాల ముఖాలు తలుపుకు ఎదురుగా ఉండకూడదు. అది మీ జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు దిక్కున కూడా పెట్టుకుంటే శుభప్రదంగా పరిగణిస్తారు.
సముద్రపు ఒడ్డున పరిగెడుతున్న ఏడు గుర్రాల చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు ప్రకారం జీవితంలో ఆర్థిక పురోగతి వస్తుంది. అది మాత్రమే కాదు వాస్తు ప్రకారం ఇంట్లో ఏడు తెల్లని గుర్రాల ఫోటో పెడితే లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఈ ఫోటో ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు. విజయం, వేగం, బలానికి సంకేతంగా ఏడు గుర్రాల చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది ప్రగతికి చిహ్నంగా భావిస్తారు.
గుర్రాల వెనుక బ్యాగ్రౌండ్ ఎలా ఉంటే మంచిది?
ఏడు గుర్రాల వెనుక బ్యాగ్రౌండ్ కూడా చాలా ముఖ్యం. సూర్యోదయంతో కూడిన ఏడు గుర్రాల పెయింటింగ్ ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పెయింటింగ్ పెట్టుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. చంద్రుడి బ్యాగ్రౌండ్ ఉన్న గుర్రాల పెయింటింగ్ శాంతిని చూస్తుంది. అదృష్టంగా పరిగణిస్తారు.
సముద్రపు నీటిలో గుర్రాలు పరిగెడుతున్నట్టు పెయింటింగ్ ఉంటే అది కొనేందుకు అసలు ఆలోచించకండి. ఇది ఇంటికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. పనిలో పురోగతిని తెస్తుంది. పరిగెడుతున్న గుర్రాలు వేగాన్ని సూచికగా చెప్తారు. ఇవి వేగం, పరాక్రమం, పట్టుదలకు చిహ్నంగా చూస్తారు. గుర్రాల పెయింటింగ్ బ్యాగ్రౌంగ్ మాత్రమే కాదు వాటి రంగు కూడా ప్రాముఖ్యత ఉంటుంది.
ఏ రంగు గురాలు దేనికి సంకేతం
తెలుపు రంగులోని ఏడు గుర్రాల పెయింటింగ్ ఎక్కువ మంది ఇంట్లో పెట్టుకుంటారు. తెలుపు రంగు శాంతి, విజయం, శ్రేయస్సుని సూచిస్తుంది. అందుకే ఇంట్లో, ఆఫీసులో ఈ రంగు గుర్రాల పెయింటింగ్ పెట్టుకోవచ్చు. నల్లటి గుర్రాలు శని గ్రహాన్ని సూచిస్తాయి. బూడిద రంగు గుర్రాలు రాహు గ్రహాన్ని సూచిస్తాయి. బంగారు రంగు గుర్రాలు సూర్యుడికి ప్రతీకగా చెప్తారు.
బెడ్ రూమ్, పూజ గది, స్టడీ రూమ్, వాష్ రూమ్ దగ్గర మాత్రం ఈ గుర్రాల పెయింటింగ్ పెట్టుకోకూడదు. గుర్రాలన్నీ ఒకవైపు పరిగెడుతున్నటు వంటి పెయింటింగ్ కొనుగోలు చేయాలి. అసంపూర్తిగా ఉన్న గుర్రాల చిత్రాన్ని తీసుకోకూడదు. అవి భూమి మీద ఉన్నట్టు ఉండాలి. సముద్రంలో ఈదుతున్న గుర్రాల పెయింటింగ్ పెట్టుకోకూడదు. గుర్రాల వెనుక ప్రతికూల వాతావరణం ఉన్నటువంటి చిత్రాలు ఎంచుకోవద్దు.